పంద్రాగస్టున జాతీయ జెండా ఎగరేస్తాం.. మాకు రక్షణ ఇవ్వండి: ప్రధానికి ఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే విజ్ఞప్తి

By Mahesh KFirst Published Aug 14, 2022, 8:20 PM IST
Highlights

దేశమంతా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంసిద్ధమై ఉండగా.. ఓ ఎమ్మెల్యే మాత్రం భయంతో ప్రధానికి లేఖ రాశారు. రేపు తాను జాతీయ జెండా ఎగరేయడానికి సెక్యూరిటీ సమకూర్చాల్సిందిగా మొరపెట్టుకున్నారు. గతేడాది తనను త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించకుండా టీఎంసీ గూండాలు అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
 

న్యూఢిల్లీ: భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇప్పటికే ప్రారంభించింది. రేపు ఉదయం జెండా ఎగరేసి వందనం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇంటింటికీ జెండాలు అందాయి. ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ, ఓ ప్రజా ప్రతినిధి ప్రధానమంత్రికి ఆశ్చర్యకరమైన లేఖ రాశారు. తాను కూడా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తానని, ఈ జెండాను ఎగరేయడానికి తనకు రక్షణ కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశం అయింది. 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న దేశంలో జెండా ఎగరేయడానికి రక్షణ అడగడం ఏమిటన్నా.. ఆశ్చర్యం అందరిలోనూ కలుగుతున్నది.

పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్ ఏకైక ఎమ్మెల్యే నౌషద్ సిద్ధిఖీ ప్రధానమంత్రికి ఈ నెల 13న లేఖ రాశారు. ఒక అత్యవసరమైన విజ్ఞప్తి తాను చేస్తున్నానని, పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానిని ఆ లేఖలో కోరారు. పంద్రాగస్టున జెండా ఎగరేయడానికి తనకు, ఇతర పౌరులకు రక్షణ కల్పించాలని రిక్వెస్ట్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలుసని, కేంద్ర హోం వ్యవహారాల శాఖ దీనికి సంబంధించి అన్ని వివరాలను తమకు సమగ్రంగా వివరించారనీ ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకలు ఎలా జరుపుకోవాలని, జెండా ఎగరేయడానికి సంబంధించి ఎన్నో సూచనలు చేశారని వివరించారు. కానీ, తాను కొన్ని విషయాలు తెలియజేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. గతేడాది పంద్రాగస్టును తాను త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి వెళ్లుతుండగా కొందరు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు భంగర్‌లో అడ్డుకున్నారని వివరించారు.

తన పార్టీ సభ్యులు, పార్టీ సానుభూతిపరులను జెండా ఎగరేయకుండా చాలా గ్రామాల్లో టీఎంసీ నేతలు బలవంతంగా అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. భంగర్‌లో తనను అడ్డుకున్న నేతల పేర్లనూ ఆయన ప్రస్తావించారు. మొదచ్చార్ హొసెన్, బహరుల్ ఇస్లాం, అవచాన్ మొల్లా, అబ్దుల్ ఖేయర్ గయెన్‌లుగా వారిని పేర్కొన్నారు. అంతేకాదు, తాను ఎన్నో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాబట్టి, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తమకు రక్షణ కల్పించాలని కోరారు. గతేడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని తాము రక్షణను, భద్రతను కోరుతున్నామని వివరించారు. తద్వార తాము, ఇతరులూ స్వేచ్ఛ జాతీయ జెండా ఎగరేయడానికి ఆస్కారం కలుగుతుందని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో టీఎంసీ, బీజేపీతో పాటు మరోపార్టీ ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్ కూడా బోణీ కొట్టింది. లెఫ్ట్, కాంగ్రెస్, ఇతర పార్టీలు అన్నీ కూడా బోణీ కొట్టలేదన్న విషయం తెలిసిందే.

click me!