నెహ్రూ ఫొటో తొలగించి.. సావర్కర్ ఫొటో చేర్చి.. కర్ణాటకలో మరో వివాదం.. జెండా క్యాంపెయిన్ యాడ్‌తో కలకలం

By Mahesh KFirst Published Aug 14, 2022, 7:03 PM IST
Highlights

కర్ణాటక ప్రభుత్వ యాడ్ మరో వివాదానికి తెర తీసింది. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ కోసం విడుదల చేసిన యాడ్‌లో జవహర్ లాల్ నెహ్రూ ఫొటోను తొలగించింది. అంతేకాదు, అందులో వినాయక్ సావర్కర్ ఫొటోను చేర్చడంతో కాంగ్రెస్ విరుచుకుపడింది.

న్యూఢిల్లీ: కర్ణాటకలో మరో వివాదం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌కు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఓ యాడ్‌ను విడుదల చేసింది. ఈ యాడ్ ఈ రోజు (ఆగస్టు 14న) ఫుల్ పేజీ యాడ్‌తో న్యూస్ పేపర్‌లలో అచ్చయింది. ఈ యాడ్‌లో స్వాతంత్ర్య సమర యోధుల్లో జవహర్ లాల్ నెహ్రూ లేకపోవడం చర్చను లేవదీసింది. అంతేకాదు, అందులో కొత్తగా వినాయక్ సావర్కర్ ఫొటో చేర్చడం కలకలం రేపింది. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ విరుచుకుపడింది.

జవహర్ లాల్ నెహ్రూ ఫొటో తొలగించడానికి కూడా బీజేపీ ఓ కారణం చెప్పింది. తాము కావాలనే జవహర్ లాల్ నెహ్రూ ఫొటోను ఆ యాడ్‌లో చేర్చలేదని తెలిపింది. దేశాన్ని ఇండియా, పాకిస్తాన్‌లుగా విడగొట్టినందున నెహ్రూ ఫొటోను చేర్చలేదని బీజేపీ ప్రతినిధి రవి కుమార్ తెలిపారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వాతంత్ర్యం కోసం పోరాడాడని అన్నారు. ఆయన లాగే.. ఝాన్సీ రాణి, గాంధీ, సావర్కర్‌లు కూడా పోరాటం చేశారని పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ దేశానికి తొలి ప్రధాన మంత్రి. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడని, కానీ, దేశాన్ని విడగొట్టాడని తెలిపారు.

ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత చర్య అని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, జైరాం రమేశ్, సిద్దా రామయ్యలు బసవరాజ్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు సంధించారు.

Sorry Nehru is not a freedom fighter but Savarkar is. 🤷🏻‍♀️ pic.twitter.com/m6sZ7YOuAf

— Savukku Shankar (@Veera284)

ఇది భారత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు సిగ్గుచేటు అని డీకే శివకుమార్ అన్నారు. భారత్ నేడు 75వ స్వాతంత్ర్య దిన ఉత్సవాలను జరుపుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రధాని వెంటనే సీఎం బసవరాజు బొమ్మైని బర్తరఫ్ చేయాలని, వారు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఇలాంటి సంకుచిత చర్యలను నెహ్రూ ఉపేక్షించగలడని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సీఎం కుర్చీ కోసం ఎంతకైనా దిగజారేలా ఉన్నాడని ఈ ఉదంతం తెలుపుతున్నదని పేర్కొన్నారు. ఇది ఆయన తండ్రి ఎస్ఆర్ బొమ్మై, అలాగే, ఎస్ఆర్ బొమ్మైకి తొలి రాజకీయ గురువు అయిన ఎంఎన్ రాయ్‌లనూ అవమానించినట్టేనని బసవరాజు బొమ్మైకి తెలుసు అని తెలిపారు. 

కర్ణాటక ప్రభుత్వం నెహ్రూ ఫొటోను కావాలని అచ్చు వేయించలేకపోయి ఉండొచ్చని, కానీ, వారు దేశ చరిత్రను తుడిచేయలేరని, తిరిగి రాయలేరని రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్ అన్నారు. ఆధునిక, సామ్యవాద, లౌకికవాద, పురోగమించే భారత నిర్మాతగా జవహర్ లాల్ నెహ్రూను ప్రతి భారతీయుడు ముందడుగు వేస్తూ గుర్తు పెట్టుకుంటారని తెలిపారు.

బ్రిటీష్ వారితోనూ బానిసత్వం పోయిందేమోనని తాము అనుకున్నామని, కానీ, ఈ అభిప్రాయాన్ని కర్ణాటక సీఎం బసవరాజు  బొమ్మై తప్పు అని స్పష్టం చేశారని, ఆయన ఇప్పటికీ ఆర్ఎస్ఎస్‌కు బానిస అని వెల్లడించారని సిద్దారామయ్య ట్వీట్ చేశారు.

click me!