లాక్‌డౌన్‌లోకి బెంగాల్... కేవలం మూడు గంటలే అనుమతి, వీటికి మినహాయింపు

By Siva KodatiFirst Published May 15, 2021, 2:49 PM IST
Highlights

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రోజురోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూలు విధించాయి. దీనితో పాటు కఠిన ఆంక్షలు విధిస్తూ పరిస్ధితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రోజురోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూలు విధించాయి. దీనితో పాటు కఠిన ఆంక్షలు విధిస్తూ పరిస్ధితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు.

ఈ క్రమంలో దేశంలో లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాల జాబితాలోకి తాజాగా పశ్చిమ్‌ బెంగాల్‌ చేరింది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మే 30 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తూ శనివారం పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. 

పరిశ్రమలు, అంతరాష్ట్ర రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు వంటి అన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బెంగాల్ సర్కార్ ప్రకటించింది.  అలాగే మతపరమైన కార్యక్రమాలతో సహా అన్ని రకాల సమావేశాలపై నిషేధం విధించింది. విద్యాసంస్థల విషయంలో కూడా ఇవే ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

Also Read:కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి !

టీ తోటల్లో 50 శాతం, జనపనార మిల్లుల్లో 30 శాతం మంది కార్మికులు పనిచేసేలా మినహాయింపు కల్పించింది. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం ఏడు నుంచి 10 గంటల వరకు కేవలం 3 గంటలు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీచేసింది.  

కాగా, గడిచిన 24 గంటల్లో బెంగాల్‌లో 20,846 మందికి కరోనా సోకగా..136 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి నుంచి ఎనిమిది దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్‌లో వైరస్ ఉద్ధృతికి కారణమని అధికారులు అంటున్నారు.

పలు పార్టీలకు చెందిన కీలక నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రజలు సైతం కొవిడ్ ఆంక్షలను పక్కనబెట్టి భారీగా సభలకు హాజరయ్యారు. అదే ఇప్పుడు బెంగాల్ కొంపముంచింది. 

click me!