
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దంపతులు తమకు లిక్కర్ కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని తాము కన్న బిడ్డను అమ్ముకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అమ్మేసిన బిడ్డ తల్లి, తండ్రితోపాటు తాతను కూడా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇంకా ఆ ఆరు నెలల చిన్నారి ఆచూకీని కనుక్కోవాల్సి ఉన్నది. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పనిహతిలో చోటుచేసుకుంది.
చిన్నారి అమ్మకంలో తాత మధ్య దళారీగా ఉన్నాడని అనుమానిస్తున్నారు. పిల్లల అక్రమ రవాణా ముఠా ప్రమేయం కూడా ఇందులో ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుకుంటున్నారు.
చిన్నారి తండ్రి జయదేబ్ చౌదురి, తల్లి సతి చౌదరి, తాత కనాయ్ చౌదరిలను పోలీసులు అరెస్టు చేశారు. పాపను ఎవరికి అమ్మారనే విషయాన్ని తెలుసుకోడానికి వారిని ప్రశ్నించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ పాప కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడంతో స్థానికులకు డౌట్ వచ్చింది. పాపా కనిపించడం లేదని ఆరా తీయగా.. తమ బంధువుల దగ్గర ఉన్నట్టు వారు బుకాయించారు. కానీ, స్థానికులకు వారి తీరుపై అనుమానాలు వచ్చాయి. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ దంపతులకు మద్యం వ్యసనంగా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు. తరుచూ వారి ఇంటిలో కలహాలు జరుగుతాయని, ఇరుగుపొరుగు తోనూ గొడవపడుతుంటారని వివరిస్తున్నారు. కానీ, వారి తాగుబోతుతనానికి వారు కన్న బిడ్డనే అమ్ముతారని అనుకోలేదని స్థానికులు ఆశ్చర్యంగా వివరిస్తున్నారు.