మీ పద్ధతులు మార్చుకోకుంటే... పోలీసు స్టేషన్‌ను తగులబెడతాం: బీజేపీ ఎమ్మెల్యే

By Mahesh KFirst Published Jan 1, 2023, 3:26 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే స్వపన్ మజుందార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోకుంటే పోలీసు స్టేషన్‌ తగులబెడతామని అన్నారు. బోన్‌గావ్ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలీసు స్టేషన్‌ను ఉద్దేశిస్తూ ఈ కామెంట్ చేశారు.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే స్వపన్ మజుందార్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోకుంటే బోన్‌గావ్ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలీసు స్టేషన్‌ను తగులబెడతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో అశోక్‌నగర్ ఏరియాలో ఓ ర్యాలీలో పార్టీ వర్కర్లను ఉద్దేశిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు.

స్థానిక పోలీసు స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్ ఇంచార్జీ, ఆఫీసర్ ఇంచార్జీలు బీజేపీ వర్కర్లను వేధిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అదే టీఎంసీ వర్కర్లను ఆ ఏరియాలో వారి అక్రమ కార్యకలాపాలనూ నిర్వహించుకోవడానికి అనుమతిస్తున్నారని తెలిపారు. ఈ పోలీసు స్టేషన్‌లోని అధికారులు తమ పద్ధతులు మార్చుకోకుంటే పోలీసు స్టేషన్‌ను కాల్చేస్తామని వివరించారు.

Also Read: టీఎంసీ నేతలను చెట్టుకు కట్టేసి.. బట్టలూడదీయండి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

అశోక్‌నగర్ పోలీసు స్టేషన్ ఐసీ, ఓసీలు జాగ్రత్తగా వినాలని, టీఎంసీ చేస్తున్న అఘాయిత్యాలకు వంతపాడటం మానుకోవాలని హెచ్చరించారు. టీఎంసీ కార్యకర్తలు ఏది చేసినా ఉపేక్షించి బీజేపీ కార్యకర్తలను, సామాన్య పౌరులను మాత్రం కనీసం అధికార పార్టీ అఘాయిత్యాలను నిరసించడానికి అనుమతించకుంటే ఊరుకోబోమని అన్నారు. ఈ ఏరియాలో తమ బీజేపీ వర్కర్ ఒకరిని టీఎంసీ సభ్యులు దారుణంగా కొట్టారని, కానీ, ఆ పోలీసులు ఇప్పటికీ దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేయలేదని ఆరోపణలు చేశారు. వీటిని తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మీరు పద్ధతులు మార్చుకోకుంటే ఏదో ఒక రోజు ఆ పోలీసు స్టేషన్‌ను తగులబెట్టేలా తమను ఉసిగొల్పిన వారు అవుతారని అన్నారు.

పోలీసు స్టేషన్ ఐసీ, ఓసీ అధికారులు టీఎంసీ పార్టీ ఏజెంట్లుగా పని చేస్తున్నారని, వారు నిష్పక్షపాతంగా పని చేయడం లేదని అన్నారు. ఇలాగే కొనసాగితే వారిపైనా దాడి చేస్తామని పేర్కొన్నారు.

కాగా, మజుందార్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. స్వపన్ మజుందార్ వ్యాఖ్యలను తాము సమర్థించబోమని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి సామిక్ భట్టాచార్య అన్నారు. అయితే, ఆయన ఏమీ చేయలేని నిస్సహాయత నుంచి మాత్రమే ఇలా మాట్లాడాల్సి వచ్చిందన్న విషయాన్ని గమనించుకోవాలని వివరించారు. బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలను టీఎంసీ వర్కర్లు కొడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.

click me!