
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఫార్ములాపై హెచ్చరికలు చేసి హమాస్‌పై ఒత్తిడి చూపించడంతో హమాస్ కొన్ని షరతులను అంగీకరించింది. ట్రంప్ సూచించినట్లు గాజాలోని పాలనా బాధ్యత స్వతంత్ర సాంకేతిక నిపుణులైన ప్యాలెస్టీనియన్ సంస్థకు అప్పగించడానికి సిద్ధమైనట్టు తెలిపింది. బందీలను విడుదల చేసే విషయంపై చర్చలకు రెడీగా ఉందని తెలియజేసింది, అలాగే ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజాలో పాలన కొనసాగించదని పేర్కొంది. దీనికి ఇజ్రాయెల్ ఆమోదం తెలిపినప్పటికీ రెండు పక్షాల మద్య తక్షణ చర్చలు, బందీల మార్పిడి, గాజాపై బాంబ్ దాడుల నిలిపివేత వంటి సాంకేతిక అంశాలపై వేగంగా ఒప్పందం ముగించాల్సింది. ఇదిలా ఉంటే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాను హమాస్ అంగీకరించడాన్ని భారత్ స్వాగతించింది. గాజాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ నాయకత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ప్రజలపై భద్రతాదళాల భారీ దమనకాండ జరుగుతోంది. అయితే దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. పాక్ పాలకుల అమానవీయ చర్యలతో సహజవనరులను దోచుకోవడం, స్థానికులపై ఉక్కుపాదం మోపడం ఈ అసంతృప్తికి కారణమని తెలిపారు. పీవోకేలో నిరసనకారులపై కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై పాకిస్థాన్ బాధ్యత వహించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
2025 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో రూ.2,789 కోట్ల నికర జీఎస్టీ, రూ.3,653 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు సాధించింది. ఇది గత సెప్టెంబరుతో పోలిస్తే వరుసగా 7.45%, 4.19% పెరుగుదల. రాష్ట్ర జీఎస్టీ రూ.1,185 కోట్లు (8.28% అధికం), ఐజీఎస్‌టీ సర్దుబాట్లు రూ.1,605 కోట్లు (6.84% అధికం), పెట్రోలియంపై వ్యాట్ రూ.1,380 కోట్లు (3.10% అధికం)గా ఉన్నాయి. వృత్తి పన్ను 43.75% పెరిగింది. ఏప్రిల్-సెప్టెంబరు మధ్య మొత్తం రూ.26,686 కోట్ల రాబడి నమోదై, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని వాణిజ్య పన్నులశాఖ తెలిపింది.
* తెలంగాణలో బతుకమ్మ పండగా అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 29వ తేదీన నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుక సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డు కోసం భారీ బతుకమ్మ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 63 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన తెలంగాణ మహా బతుకమ్మకు గిన్నిస్ రికార్డు లభించింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక 63 అడుగుల బతుకమ్మ చుట్టూ1354 మంది మహిళలు తిరుగుతూ ఆడిపాడారు.
* మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
* తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటుచేసింది. ఈ విషయాన్ని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. విజయదశమి సందర్భంగా ప్రధాన, అనుబంధ సంస్థల కార్యవర్గాల నియామకాలు చేపట్టగా, 80 శాతం పదవులు బడుగు, బలహీనవర్గాలకు కేటాయించారు.
వరుస విజయాలతో టీమిండియా దూకుడు మీదుంది. ఆసియా కప్‌లో అన్ని మ్యాచ్‌లో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌పై సత్తా చాటింది. మ్యాచ్ విజయంలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఇక ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్‌లో కూడా టీమిండియా మంచి ఆటతీరును కనబరుస్తోంది. ఇక అక్టోబర్ 19వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.