మళ్లీ మొదలైన పెళ్లిళ్ల సీజన్.. కొత్త జీవితం మొదలుపెట్టనున్న లక్షలాది మంది యువత.. లక్షల కోట్ల వ్యాపారం

By Mahesh KFirst Published Nov 8, 2022, 10:39 AM IST
Highlights

దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 4వ తేదీన మళ్లీ మొదలైంది. వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో రూ. 3.75 లక్షల కోట్ల మేరకు వ్యాపారం జరిగే అవకాశం ఉన్నదని సీఏఐటీ అంచనా వేసింది.
 

హైదరాబాద్: దేశంలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇప్పటికే పెళ్లి హడావిడీ ప్రారంభమైంది. ఈ నెల 4వ తేదీ నుంచి మొదలైన పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. లక్షల మంది యువతీ యువకులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అనే సంస్థ రీసెర్చ్ వింగ్ ఓ సర్వే చేపట్టింది. వచ్చే నెల 14వ తేదీ వరకు 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని తెలిపింది.

మన దేశంలోని 35 నగరాల్లో 4,302 మంది బిజినెస్‌మ్యాన్‌లను, సర్వీస్ ప్రొవైడర్లను అడిగి సీఏఐటీ రీసెర్చ్ విభాగం ఈ సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారం ఆధారంగా ఒక అంచనాను వెల్లడించింది. దీని ప్రకారం, ఈ సీజన్‌లో 32 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ పెళ్లిళ్లతో రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందనీ అంచనా కట్టింది. కేవలం ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు సీఏఐటీ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ వివరించారు. వీటి ద్వారా ఢిల్లీలో 75 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపారు. 

Also Read: gold prices:బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. నేడు 10గ్రా ధర ఎంత తగ్గిందంటే...?

గతేడాదిలో ఇదే సీజన్‌లో 25 లక్షల పెళ్లిళ్లు జరిగాయని పేర్కొన్నారు. ఈ పెళ్లిళ్ల ద్వారా రూ. 3 లక్షల కోట్ల వ్యాపారం వరకు జరిగిందని ఆయన తెలిపారు. కాగా, ఈ పెళ్లిళ్ళ సీజన్‌లో గతేడాది కంటే మించి సుమారు రూ. 3.75 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉన్నదని వివరించారు. కాగా, మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వచ్చే ఏడాది జనవరి 14లో మొదలు కానుంది. అప్పటి నుంచి జులై వరకు ముహూర్తాలు ఉంటాయని ప్రవీణ్ తెలిపారు.

click me!