
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఓ దుండగుడు అదనపు వరకట్నం కోసం భార్యను వేధించాడు. సిగరెట్ కాల్చొద్దంటే.. అదే సిగరెట్‌తో ఆమెను కాల్చాడు. తల్లి, తండ్రీ కలిసి ఆమెను టార్చర్ పెట్టారు. చివరకు భార్యను ఆమె తల్లి వద్దకు పంపారు. ఆ తర్వాత విడాకుల నోటీసులు పంపారు.
అహ్మదాబాద్‌లో నరన్‌పురాలో నివసిస్తున్న 32 ఏళ్ల మహిళ తన భర్త, అత్తా మామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ముందు టూ వీలర్ కోసం తనను వేధించారని, దాన్ని తన తల్లిదండ్రులు కొనిచ్చారని పేర్కొంది. ఆ తర్వాత భర్త తనను సిగరెట్‌తో కాల్చాడని ఆరోపించింది.
2020లో ఆమె తన భర్తను వైభవంగా పెళ్లి చేసుకుంది. ఇంట్లో అవసరమైన గృహోపకరణాలు అన్నింటితో మెట్టినింట అడుగు పెట్టిందని వివరించింది. వ్యాపారం నిర్వహించడానికి ఇంటి నుంచి డబ్బులు తేవాలని తన అత్తామామలు తొలుత డిమాండ్ చేశారని తెలిపింది. సరిపడా వరకట్నం తీసుకురాకుంటే టార్చర్ చేస్తామని బెదిరించారని పేర్కొంది. తన భర్తకు టీ వీలర్ కొనివ్వాలని ఆ తర్వాత డిమాండ్ చేశారని వివరించింది. తన తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని టూ వీలర్‌ను భర్తకు కొనిచ్చానని పేర్కొంది. 2020లోనే తాను తన తల్లి ఇంటికి వెళ్లానని, కానీ, తనను వెనక్కి తీసుకురావడానికి ఎవరూ రాలేదని వివరించింది.
ఆ తర్వాత తానే తన అత్తవారింటికి వచ్చినట్టు ఆ మహిళ తెలిపింది. ఒక రోజు తన భర్త సిగరెట్ తాగుతూ కనిపించాడని వివరించింది. తాను వారించగా.. అదే సిగరెట్‌తో తనను కాల్చాడని పేర్కొంది. వరకట్నం తీసుకురావాలని డిమాండ్ చేశాడని తెలిపింది.
కొన్ని రోజుల తర్వాత తాను కొన్ని సరుకులు కొనడానికి బయటకు వెళ్లానని, తిరిగి వచ్చే సరికి ఇంటికి తాళం వేశారని వివరించింది. ఎంత పిలిచినా, ఏడ్చినా తలుపులు తీయలేదని పేర్కొంది. సుమారు రాత్రి 11 గంటల ప్రాంతంలో తాను తన అమ్మ దగ్గరకు వెళ్లిపోయానని, అప్పటి నుంచి అక్కడే ఉంటున్నానని తెలిపింది.
మధ్యలో ఒకసారి ఏదో పండుగకు తనను పిలవగా వెళ్లానని, ఆ తర్వాత మళ్లీ తన అమ్మ వారి ఇంటికి పంపిచేశారని తెలిపింది. తనకు కరోనా వచ్చినప్పటికీ ఎవరూ రాలేదని, ట్రీట్‌మెంట్ కూడా ఇప్పించలేదని వివరించింది. సెప్టెంబర్ నెలలో తనకు విడాకుల నోటీసులు పంపారని పేర్కొంది. దీంతో తాను మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని వివరించింది.