చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయికి క‌నిష్ట ఉష్ణోగ్రతలు.. ద‌ట్ట‌మైన పొగమంచు.. : ఐఎండీ

By Mahesh RajamoniFirst Published Jan 3, 2023, 10:00 AM IST
Highlights

New Delhi: దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
 

Weather updates: దేశంలోని చాలా ప్రాంతాల్లో చ‌లిగాలుల ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో సాధార‌ణం నుంచి చాలా ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో దేశంలో రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఐఎండీ రిపోర్టుల ప్ర‌కారం..  వాయువ్య భారతదేశంలోని మైదాన ప్రాంతాలలో రాబోయే నాలుగు రోజుల పాటు చలిగాలుల పరిస్థితులు ఉండవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌తో సహా వాయువ్య భారతదేశంలోని మైదానాల్లో దట్టమైన పొగమంచు నుండి చాలా దట్టమైన పొగమంచు, చలిగాలుల పరిస్థితులు రానున్న 5 రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు,  వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ‌ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. "ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య, తూర్పు, తూర్పు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది" అని పేర్కొంది. వాయువ్య భారతదేశంలో (తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్) ఈ నెలలో వర్షపాతం సైతం కురిసే అవ‌కాశ‌ముంద‌ని ఔఎండీ అంచ‌నా వేసింది. ఇది సాధారణం కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని అనేక ప్రాంతాలు, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచ‌నా వేసింది. 

కాగా, దేశ రాజ‌ధాని ఢిల్లీలో, న్యూ ఇయర్ సందర్భంగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నట్టు క‌నిపించిన చ‌లి గాలుల ప్ర‌భావం, పొగ‌మంచు ప‌రిస్థితులు మళ్లీ తిరిగి వచ్చాయి. ఎముకలు కొరికే చ‌లి పరిస్థితులను అధిగమించడానికి ప్రజలు రోడ్ల వెంట చ‌లిమంటల వేసుకుంటున్నారు. పొగ‌మంచు కార‌ణంగా ర‌వాణ వ్యవ‌స్థ ఆల‌స్యంగా ముందుకు సాగుతోంది.  అలాగే, బెంగాల్ రాజ‌ధాని కోల్‌కతాలో సోమవారం చలి గాలుల తీవ్ర‌త పెర‌గ‌డంతో పాటు పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గింది. దీంతో వాహ‌నాల రాక‌పోక‌లు ఆల‌స్యం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని 36 జిల్లాల్లో రాబోయే రెండు రోజులపాటు చలిగాలులు, దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం, మీర్జాపూర్, వారణాసి, జౌన్‌పూర్, ఘాజీపూర్, అజంగఢ్, మౌ, బల్లియా మరియు గోరఖ్‌పూర్‌తో సహా అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది.

ఉత్తర భారతదేశంలో చలిగాలుల పరిస్థితులు, చాలా ప్రాంతాల్లో 3-4 రోజులు దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  ఇక హిమాచల్ ప్రదేశ్ చలిగాలులతో అల్లాడిపోతోంది. హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా పొగ‌మంచు ప‌రిస్థితుల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో 92 రోడ్లు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.

click me!