Monsoon: దేశ‌రాజ‌ధాని ఢిల్లీని తాకిన‌ వ‌ర్షాలు.. ఆరెంజ్ అల‌ర్ట్ జారీ !

By Mahesh RajamoniFirst Published Jun 30, 2022, 2:11 PM IST
Highlights

Delhi Weather report:  దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప‌రిధిలో గురువారం నాడు మోస్తరు నుంచి భారీ  వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే,  జూలై 1 నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 33-34 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుందని వాతావరణ శాఖ అంచ‌నా వేసింది. 
 

Rain lashes parts of Delhi-NCR: దేశ‌వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ప‌లు చోట్ల మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టంతో పాటు కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం, రోడ్లు జ‌ల‌మ‌యంగా మార‌డం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే దేశ రాజ‌ధానిలో కూడా వాన‌లు దంచి కొడుతున్నాయి. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప‌రిధిలో వ‌ర్షాలు కురుస్తున్నాయి. న‌గ‌రంలోని పలు ప్రాంతాలను వర్షం ముంచెత్తడంతో ఢిల్లీవాసులకు ఇబ్బందులు ప‌డుతున్నాయి. రుతుప‌వ‌నాలు ఢిల్లీని తాక‌డంతో వాటి ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రోడ్లు జ‌ల‌మ‌యం కావ‌డంతో పాటు ప‌లు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

రాజధాని ప‌రిధిలోని తూర్పు కైలాష్, బురారీ, షాహదారా, పట్పర్‌గంజ్, ITO క్రాసింగ్ మరియు ఇండియా గేట్‌తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో  గురువారం ఉద‌యం వర్షం పడింది. ఒక్క‌సారిగా కురిసిన కుండ‌పోత వ‌ర్షంతో రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉష్ణోగ్రతలు సైతం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఎండ తీవ్ర‌త నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ప్ప‌టికీ.. వ‌ర్షాల‌తో ఇబ్బందులు పెరిగాయి. "భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.. ఈ స‌మ‌యంలో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది" అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం నాటి బులిటెన్ లో పేర్కొంది. "అరేబియా సముద్రం మరియు గుజరాత్‌లోని మిగిలిన భాగాలు, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని మిగిలిన భాగాలు, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్,  జమ్మూ కాశ్మీర్‌, పంజాబ్‌, హ‌ర్యానా,చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో రుతుప‌వ‌నాలు మ‌రింత ముందుకు సాగ‌డానికి అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయి. రానున్న 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయి" అని ఐఎండీ పేర్కొంది.

ఢిల్లీలో గురువారం ఉదయం అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పలు రహదారులు జలమయమయ్యాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు రహదారులు నీటిలో మునిగిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. గంట‌ల స‌మ‌యం పాటు వాహ‌నాలు నిలిచిపోయాయి. ప్రగతి మైదాన్, వినోద్ నగర్ సమీపంలోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, పుల్ ప్రహ్లాద్‌పూర్ అండర్‌పాస్, డబ్ల్యూహెచ్‌ఓ భవనం ముందు ఉన్న ఐపీ ఎస్టేట్, జకీరా ఫ్లైఓవర్ కింద, జహంగీర్‌పురి మెట్రో స్టేషన్, లోనీ రోడ్ రౌండ్‌అబౌట్ మరియు ఆజాద్‌పూర్ మార్కెట్ అండర్‌పాస్‌తో సహా పలు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షం ఈ ప్రాంతంలో విమానాల రాకపోకలను కూడా ప్రభావితం చేసిందని అధికారులు తెలిపారు.

రుతుపవనాలు ప్ర‌వేశించిన మొదటి 10 రోజుల్లో ఢిల్లీలో సాధార‌ణం కంటే అధికంగానే వర్షపాతం నమోదవుతుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాభావాన్ని భర్తీ చేయడంలో ఈ ప‌రిస్థితులు సహాయపడ‌తాయ‌ని పేర్కొంటున్నారు. జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకు ఢిల్లీలో సాధారణం 74.1 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే కేవలం 24.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇదిలావుండగా, దేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈశాన్య భారతంలో భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి.. సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. 
 

click me!