మందు కోసం తాళి బొట్టు అమ్మకం.. అక్రమ మద్యం దుకాణంపై మహిళల దాడి.. ఎక్కడంటే?

By Mahesh KFirst Published Jun 30, 2022, 1:46 PM IST
Highlights

అక్రమ మద్యం దుకాణంపై మహిళలు దాడి చేశారు. ఆ దుకాణాన్ని ధ్వంసం చేశారు. అనంతరం, ఆ దుకాణ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 

చెన్నై: మద్యం వ్యసనం ఒళ్లునే కాదు.. ఇల్లునూ గుల్ల చేస్తుంది. వ్యక్తిగతంగానే కుటుంబపరంగానూ తీవ్రంగా నష్టపోవాల్సిందే. ముఖ్యంగా మద్యానికి బానిసైన వ్యక్తి భార్య పిల్లలు ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో గొడవలు.. సామాజికంగానూ ఛీత్కారాలు శరామామూలు అయిపోతాయి. పెరుగుతున్న పిల్లలపై కుటుంబ కలహాలు మానసికంగా ప్రతికూల ప్రభావం వేస్తుంటాయి. ఆ ఇంటికే భవిష్యత్ అంధకారంగా మారిపోతుంది. అందుకే మద్యపాన నిషేధం కోసం సామాజిక కార్యకర్తలు ఎన్నో ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా మహిళలే మద్యపానాన్ని నిషేధించడానికి ఎన్నో పోరాటాలు చేశారు. తాజాగా, ఈ పోరాటాలను మరోసారి గుర్తుకు తెచ్చే ఓ ఘటన జరిగింది. మద్యం కొనుక్కోవడానికి డబ్బు లేదని ఓ మందుబాబు భార్య మెడలోని తాళిబొట్టును అమ్మేసిన ఉదంతం ఈ ఘటనకు తక్షణ కారణంగా మారింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.

నాగపట్టిణం జిల్లా ఆదమంగళంలోని కీళ కన్నాపూర్ గ్రామంలో అకమ్రంగా మద్యం అమ్ముతున్న దుకాణంపై మహిళలు దాడి చేశారు. ఆ గ్రామంలో పదేళ్లుగా ఓ మద్యం దుకాణాన్ని రన్ చేస్తున్నారు. అక్రమంగా వారు పుదుచ్చేరి నుంచి మందు తెచ్చి అమ్ముతున్నారని అక్కడి మహిళలు ఆరోపిస్తున్నారు. అక్రమంతా మద్యం అమ్మి తమ కుటుంబాలను తీవ్రంగా నష్టం చేస్తున్నారని వారు ఆవేదన చెందారు. పదేళ్లుగా వారు అక్రమ రీతిలో మద్యాన్ని విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ మద్యం తాగి అక్కడి మహిళలు, పిల్లలకు సమస్యగా మారుతున్నారని అన్నారు. 

ఇటీవలే ఓ వ్యక్తి మందు తాగి తన భార్య మెడలోని మంగళసూత్రాన్ని ఆల్కహాల్ కొనుక్కోవడానికి అమ్మేశాడని స్థానికులు తెలిపారు. మంగళసూత్రాన్ని అమ్మడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. భార్యపైనా ఆ వ్యక్తి దాడి చేశాడని వివరించారు. 

ఈ ఘటన తర్వాత స్థానిక మహిళలు తీవ్ర అసహనానికి గురయ్యారరు. వారంతా అక్కడ అక్రమంగా మద్యం అమ్ముతున్న దుకాణం ముందు గుమిగూడారు. ఆ మద్యం దుకాణంపై దాడి చేశారు. ఆ దుకాణాన్ని ధ్వంసం చేశారు. అనంతరం, ఈ దుకాణ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కాగా, ఈ ఘటనను తాము పరిశీలిస్తున్నట్టు వావిలాలమ్ పోలీసులు తెలిపారు. తాము తగిన చర్యలు తీసుకుంటామనీ వివరించారు. తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్టు చెప్పారు.

click me!