దేశ‌వ్యాప్తంగా మారిన వాతావ‌ర‌ణం: ఎండ‌ల‌కు బ‌దులు దంచికొడుతున్న వాన‌లు.. ఐఎండీ కీలక వ్యాఖ్యలు

Published : May 03, 2023, 11:01 PM IST
దేశ‌వ్యాప్తంగా మారిన వాతావ‌ర‌ణం: ఎండ‌ల‌కు బ‌దులు దంచికొడుతున్న వాన‌లు.. ఐఎండీ కీలక వ్యాఖ్యలు

సారాంశం

New Delhi: వాయవ్య భారతంలో మే 5 నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మే 4 నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్ర‌స్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో వేస‌వి ప‌రిస్థితులు కాస్త త‌గ్గి.. వ‌ర్షాలు ప‌డుతున్నాయి.    

Weather Update-India: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. వేస‌వి కాలంలో బలమైన సూర్యరశ్మికి బదులుగా చల్లని గాలులు వీచ‌డం, వర్షాలు ప‌డ‌టం, చాలా ప్రాంతాల్లో మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితులు బుధవారం (మే 3) కూడా కొన‌సాగాయి. ఢిల్లీ, కోల్ కతా నుంచి జమ్మూ వరకు చాలా ప్రాంతాల్లో  వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. రానున్న 5 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశంలో ఇలాంటి వాతార‌ణ పరిస్థితులు గురించి నిపుణులు విభిన్న అంశాల‌ను గురించి ప్ర‌స్తావిస్తున్నారు. 

వాయవ్య భారతంలో మే 5 నుంచి భారీ వర్షాలు..

వాయవ్య భారతంలో మే 5 నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో వాయువ్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.  దీని కింద పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షంతో పాటు హిమపాతం కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో మధ్య భారతం, దక్షిణ భారతంలో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 4న అస్సాం, మేఘాలయలో, మే 4 నుంచి 5 వరకు అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మే 4 నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో వాతావరణ సరళిలో చెప్పుకోదగ్గ మార్పు ఉండ‌ద‌ని ఐఎండీ పేర్కొంది. 

పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం.. 

కోస్తా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 5 రోజుల్లో దేశంలోని మిగతా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు యథావిధిగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, రానున్న 5 రోజుల్లో వడగాలుల పరిస్థితి ఉండ‌ద‌నీ, పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని ఐఎండీ తెలిపింది. 

ఢిల్లీ-ఎన్సీఆర్ లో త‌డి వాతావరణం.. 

ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో మే 7 వరకు మేఘావృతమై ఉండటంతో పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో మే 8, 9 తేదీల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మే 4 నుంచి 9 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 17 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu