
Karnataka Election: ప్రధాని నరేంద్ర మోదీపై కించపరిచేలా పదజాలం వాడినందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గేకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు అందజేసింది. ప్రధానిని నాలాయక్ బేటా అని దూషించారు. ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలోని చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే.
బీజేపీ ఎమ్మెల్యేకు కూడా ఈసీ నోటీసులు
సోనియా గాంధీని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం వాడినందుకు బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఆర్ పాటిల్ (యత్నాల్)కి కూడా ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. బసనగౌడ బీజేపీ స్టార్ క్యాంపెయినర్. ఇటీవల, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీకి 'విషపూరిత పాము' అనే పదాన్ని ఉపయోగించగా, బసనగౌడ సోనియా గాంధీకి 'విష కన్య ' అని అభివర్ణించారు. ఆమె చైనాకు అండగా ఉంటూ..భారతదేశంపై ఆరోపణలు చేశారని, ఆమె పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
ప్రియాంక్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత ప్రియాంక్‌కి నోటీసు వచ్చింది. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్లో ప్రియాంక్ మాట్లాడుతూ. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల విషయంలో ప్రధాని, ఆయన పార్టీ గందరగోళం సృష్టించిందని అన్నారు.బంజారా కమ్యూనిటీ కుమారుడినని చెప్పుకుంటున్న ఆయన షెడ్యూల్డ్ కులాల పరిస్థితి ఆగం చేశారని ఆరోపించారు. ప్రధాని బంజారాల కొడుకు కాదని, పనికిరాని కొడుకు (నలాయక్ బేటా) అని ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాంటి పనికిరాని వ్యక్తి మనకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఇంత పనికిమాలిన కొడుకు ఢిల్లీలో కూర్చుంటే మీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తారు? అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి పెంచుతూ, ఎస్సీ వర్గాలకు అంతర్గత కోటా కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన బిల్లును ప్రస్తావిస్తూ ప్రియాంక్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్గత రిజర్వేషన్ల కారణంగా కోటాలో తమ వాటా తగ్గుతుందని బంజారా సామాజికవర్గం భయాందోళన చెందుతోంది.
గురువారం సాయంత్రంలోగా సమాధానం
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక్ ఖర్గే చేసిన అనర్హత ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది, ఈ ప్రకటనపై ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని బీజేపీ ప్రశ్నించింది. ఈ క్రమంలో ప్రియాంక్ ఖర్గేకి ఈసీ నోటీసులు జారీ చేసింది. గురువారం (మే 4) సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికల కమిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రియాంక్ ఖర్గేను ఈసీ కోరింది. అదే సమయంలో బసనగౌడ కూడా గురువారం (మే 4) సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. బసనగౌడపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.