
2025 నాటికి భారత్ నుంచి క్షయ వ్యాధిని దూరం చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ట్విట్లర్ ద్వారా పలు వివరాలు పంచుకున్నారు. దేశాన్ని క్షయ రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
నాణ్యమైన వైద్యం, అధునాతన చికిత్స అందించడం ద్వారా క్షయను తరిమికొట్టవచ్చని మన్సుఖ్ మాండవీయ అన్నారు. ‘‘ క్షయ వ్యాధిని నివరించవచ్చు. దీనికి చికత్స ఉంది. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, మంచి చికిత్సకు ద్వారా క్షయను కచ్చితంగా దూరం చేయవచ్చు. 2025 నాటికి భారత్‌ను క్షయ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా దీనిని నేను పునరుద్ఘాటిస్తున్నాను ’’ అని ట్వీట్ చేశారు.
క్షయవ్యాధిపై అవగాహన కల్పిస్తున్న ఫొటోను కూడా కేంద్ర మంత్రి షేర్ చేశారు. ‘‘ సాండ్ ఆర్ట్ ద్వారా టీబీపై అవగాహన కల్పిస్తున్నాం. 2022 ప్రపంచ టీబీ దినోత్సవం నాడు టీబీని అంతం చేయడానికి మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం ‘‘ అని ఆయన అన్నారు.
COVID-19 తర్వాత క్షయవ్యాధి అత్యంత ప్రమాదకారిగా ఉందని WHO ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. ‘‘ కోవిడ్‌కి ముందు క్షయవ్యాధి అగ్రస్థానంలో ఉంది. తరువాత కూడా ఉంటుంది. ఇది మనలో ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. మనం మెరుగైన సాధనాలు, డేటా, ఆరోగ్య సేవలు, అవగాహన, కళంకాన్ని తగ్గించడం, సామాజిక మద్దతు అందించడం వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలి ’’ అని ఆమె ట్వీట్ చేసింది. ప్రతిరోజు దాదాపు 4,100 మంది క్షయవ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె తెలిపారు. ప్రతీ రోజు 28,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
క్షయవ్యాధి వల్ల సంభవించే అనారోగ్య సమస్యలు, ఇతర ఆర్థిక పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆ రోగాన్ని అరికట్టడానికి, ఆ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ప్రతీ సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి (TB) దినోత్సవాన్ని జరుపుకుంటారు.