
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు (Supreme Court ) నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ సమస్యను సంచలనం చేయొద్దని పిటిషన్లర తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు కోరింది. పిటిషన్లపై విచారణకు నిర్దిష్ట తేదీని ఇవ్వడానికి కూడా అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు బాలికల పరీక్షలకు హాజరుకాకుండా ఆపేస్తుందని.. వచ్చే వారం నుంచే పరీక్షలున్నాయని, విచారణను త్వరగా చేపట్టాలని ముస్లిం విద్యార్థి ఐషత్ షిఫా తరపున వాదిస్తున్న న్యాయవాది దేవదత్ కామత్ సుప్రీం కోర్టును కోరారు. మార్చి 28న పరీక్షలు ప్రారంభమవుతున్నాయని.. అధికారులు హిజాబ్‌తో ప్రవేశానికి అనుమతించకపోవడంతో విద్యార్థికి ఒక సంవత్సరం నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు.
అయితే ఈ అభ్యర్థనపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ.. దీనికి పరీక్షలతో సంబంధం లేదని చెప్పారు. ఈ విషయాన్ని సంచలనం చేయొద్దని సూచించారు. అంతేగాకుండా కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మధ్యలో జోక్యం చేసుకోబోతుండగా.. జస్టిస్ రమణ వారించారు. గతంలో కూడా ఈ అంశంపై అత్యవసర విచారణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. హోలీ సెలవుల తర్వాత జాబితా చేయడానికి అంగీకరించింది.
ఇక, దేశవ్యాప్తంగా కలకలం రేపిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం.వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ తీర్పును వెలువరించింది. హిజాబ్ ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది.
అయితే హిజాబ్‌పై తీర్పు వెలువరించిన ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఓ వ్యక్తి బెదిరిస్తున్న వీడియో కలకలం రేపింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే సీఎం బసవరాజ్ బొమ్మై.. హిజాబ్‌పై తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్టుగా ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థీ సహా మరో ఇద్దరు న్యాయమూర్తులకు ఈ భద్రత కల్పిస్తామని వివరించారు.