
న్యూఢిల్లీ: ప్రముఖ సింగర్ సిద్దూ మూస్ వాలాను తామే హతమార్చాం అని కెనడాకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ ముఠా వెల్లడించింది. వాంటెడ్ క్రిమినల్ గోల్డీ బ్రార్ ఈ హత్య చేశానని ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అకాలీ దళ్ నేత హత్య విచారణంలో ఈ సింగర్ సిద్దూ మూస్ వాలా పేరు వచ్చిందని, కానీ, పోలీసులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గోల్డీ బ్రార్ పేరిట ప్రచారం అవుతున్న ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు హస్తం ఉన్నట్టు ఇప్పటికే వాదనలు వచ్చాయి.
లారెన్స్ బిష్ణోయ్ గ్రూపునకు చెందిన సచిన్ బిష్ణోయ్ దట్టరన్వాలితో కలిసి తానే ఈ హత్య చేసినట్టు గోల్డీ బ్రార్ పేర్కొన్నారు. సిద్దూ మూస్ వాలా పేరు విక్కీ మిద్దుఖేరా, గుర్లాల్ బ్రార్ హత్యకు సంబంధించి బయటకు వచ్చిందని, కానీ, పోలీసులు ఆయన పై ఏం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. గోల్డి బ్రార్ అసలు పేరు సతీందర్ సింగ్. ఈయన లారెన్స్ బిష్ణోయ్‌కు సన్నిహితుడిగా చెబుతారు.
బ్రార్‌పై చాలా కేసులు ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుర్లాల్ సింగ్ పెహెల్వాన్ హత్య కేసులో బ్రార్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఫరీద్‌పూర్ కోర్టు ఇదే నెలలో జారీ చేసింది.
ఇది ఇలా ఉండగా, సిద్దూ హత్య కేసు వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నదని పంజాబ్ పోలీసు చీఫ్ వీకే భావ్రా నిన్న వెల్లడించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన లక్కీ అనే ముఠా సభ్యుడు కెనడా నుంచి బాధ్యత తీసుకున్నారని వివరించారు. గత ఏడాది విక్కీ మిద్దుఖేరా హత్యలో సిద్దూ మూస్ వాలా మేనేజర్ షగన్‌ప్రీత్ పేరు వచ్చినట్టు పేర్కొన్నారు. విక్కీ మిద్దుఖేరా యూత్ అకాలీ దల్ నేత. ఆగస్టు 2021లో మొహాలిలో హత్య జరిగింది.
కాగా, సిద్ధూ మూస్ వాలా హత్య కేసును కోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అభ్యర్థించారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేస్తూ సిద్ధూ మూస్ వాలా తండ్రి బాల్కౌర్ సింగ్.. సీఎంకు లేఖ రాసిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) క్షమాపణలు చెప్పాలని, భద్రత ఉపసంహరణకు సంబంధించిన ఉత్తర్వులను బహిరంగపరిచిన అధికారులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. "పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయవలసిందిగా అభ్యర్థిస్తుంది" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వంటి ఏదైనా కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి విచారణ కమిషన్‌కు పూర్తి సహకారాన్ని కూడా అందిస్తామని భగవంత్ మాన్ హామీ ఇచ్చారు.