కేజ్రీవాల్‌కు షాక్.. అరెస్టు చేయవద్దని ఈడీని ఆదేశించలేం: ఢిల్లీ హైకోర్టు

By Mahesh KFirst Published Mar 21, 2024, 5:12 PM IST
Highlights

లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయరాదని తాము ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
 

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌లో ఈడీని అరెస్టు చేయవద్దని ఆదేశించలేమని స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరవింద్ కేజ్రీవాల్‌కు చాలా సార్లు సమన్లు పంపింది. కానీ, అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు కాలేదు. ఇటీవలే ఆయన ఢిల్లీ హైకోర్టులో కీలక పిటిషన్ వేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేయకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ, ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ అంచనాలకు భిన్నంగా తీర్పు ఇచ్చింది.

ఈ పిటిషన్‌ను ఉదయం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? ఉంటే వాటిని సమర్పించాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలకు అనుగుణంగానే ఈడీ తరఫు న్యాయవాదులు ఆధారాలను సమర్పించారు. ఈ ఆధారాలను ఢిల్లీ హైకోర్టు పరిశీలించింది.

అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలనే ఉద్దేశంతో తాము ఆయనకు సమన్లు పంపడం లేదని ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదించారు. కానీ, రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చని పేర్కొన్నారు.

ఈ వాదనలు విన్న తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయరాదని తాము ఈడీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. కేసు పురోగతిని దృష్టిలో పెట్టుకుని తాము ఇప్పుడు అందులో జోక్యం చేసుకోలేమని వివరించింది. ఏప్రిల్ 22వ తేదీకి ఈ విచారణ వాయిదా వేసింది.
 

click me!