భవిష్యత్ అంతా ముంబయిదే.. : ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

By Mahesh K  |  First Published Mar 7, 2024, 4:59 PM IST

ముంబయిని భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్‌ నిర్వహించిన నెక్స్ట్ 10 అనే వార్షిక పెట్టుబడి సదస్సులో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల కోసం తమ ప్రభుత్వం ఘననీయంగా పెట్టుబడులు పెట్టిందని వివరించారు.
 


మౌలిక వసతుల కల్పనతో జరిగే అభివృద్ధి సుస్థిరమైనదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. భవిష్యత్ నగరంగా ముంబయిని నిర్మిస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాల విషయంలో మన దేశంలో ముంబయిని అత్యంత వృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్‌ నిర్వహించిన వార్షిక పెట్టుబడి సదస్సు నెక్స్ట్ 10లో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. 

మౌలిక సదుపాయాల కోసం తమ ప్రభుత్వం గణనీయంగా పెట్టుబడి పెట్టిందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ‘2014 నుంచి మేం 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాం. ముంబయి ముఖచిత్రాన్నే మార్చేశాం. పొడవైన తీర రోడ్డులు, మెట్రో నెట్‌వర్కులను విస్తరించాం. ముంబయి తర్వాత నవీ ముంబయి వృద్ధి చెందింది. ఇప్పుడు కొత్త ముంబయి ఎయిర్‌ పోర్టు, ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్‌ల మధ్య మూడో ముంబయి అభివృద్ధి చెందుతుంది. ఇదే ఫ్యూచర్ ముంబయిగా ఉంటుంది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

Latest Videos

Also Read: AP News: 17న చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన మరో సభ.. ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

ఒకప్పుడు పెట్టుబడుల కోసం చాలా తక్కువ రాష్ట్రాలు పోటీ పడేవని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కానీ, నేడు వీటి సంఖ్య పెరిగిందని వివరించారు. ఏదేమైనా భారత అభివృద్ధిలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వేరే రాష్ట్రాలు పోటీ పడినా అది మంచి విషయమే అని చెప్పారు. ఒక వేళ పెట్టుబడులు మహారాష్ట్రకు వచ్చేవి ఏ గుజరాత్‌కో, కర్ణాటకకో తరలిపోయినా.. బాధపడాల్సినదేమీ లేదని అన్నారు. ఎందుకంటే.. అవి కూడా మన దేశంలోని తోటి రాష్ట్రాలే కదా అని పేర్కొన్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా పెట్టుబడులను ఆకర్షించడంలో ముంబయి అగ్రశ్రేణిలో ఉంటుందని స్పష్టం చేశారు. సుస్థిరమైన తమ విధానాల వల్ల ముంబయి ఎల్లప్పుడు నెంబర్ వన్‌గా ఉంటుందని చెప్పారు.

తమ రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా రాష్ట్ర భద్రత, ప్రజా మౌలిక వసతులు, పెట్టుబడులు, సుస్థిరత్వంపైనే ఉంటాయని ఫడ్నవీస్ వివరించారు. మహారాష్ట్రను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి వచ్చే దశాబ్దం చాలా కీలకమైనదని తెలిపారు.

click me!