నీటి కోసం రెండో పెళ్లి.. అవసరమైతే మూడో పెళ్లి.. లేదంటే..!!

First Published Aug 6, 2018, 3:02 PM IST
Highlights

నీటి కోసం దేశాల మధ్యా, రాష్టాల మధ్యా యుద్ధాలు జరగడం.. రోజూ కోర్టుల్లో వాదనలు జరగడం ప్రతిరోజు చూస్తునే ఉన్నాం. అలాంటిది నీటి కోసం ఏకంగా రెండో పెళ్లి చేసుకోవడమేంటీ..? అంటే భారతదేశంలో అంతే

నీటి కోసం దేశాల మధ్యా, రాష్టాల మధ్యా యుద్ధాలు జరగడం.. రోజూ కోర్టుల్లో వాదనలు జరగడం ప్రతిరోజు చూస్తునే ఉన్నాం. అలాంటిది నీటి కోసం ఏకంగా రెండో పెళ్లి చేసుకోవడమేంటీ..? అంటే భారతదేశంలో అంతే.. ఇక్కడ ఏమైనా జరుగుతుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి కూతవేటు దూరంలో ఉన్న దెగాన్మల్ గ్రామంలో కరువు ఎప్పుడూ తాండవిస్తూ ఉంటుంది.

గుక్కెడు నీళ్ల  కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిందే.. గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే. భార్య గనుక గర్భం దాల్చితే  ఇక్కడి పురుషులు రెండో పెళ్లి.. అవసరమైతే మూడో పెళ్లి కూడా చేసుకునేందుకు కూడా అక్కడి కట్టుబాట్లు అవకాశం కల్పిస్తున్నాయి. 

అసలు ఎందుకిలా..?
ఇక్కడి సమాజం మహిళలను బానిసల్లా చూస్తుంది. కరువు దృష్ట్యా.. నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లేలా వీరికి బాల్యం నుంచే శిక్షణ ఇస్తారు తల్లిదండ్రులు. ఇక్కడ ప్రతీ పనిని మహిళలే చేయాలి.. వంట చేయడం, ఇంటిని చూసుకోవడం, కుటుంబానికి అవసరమైన నీటిని తీసుకురావడం, వంట చెరకు, పశువులను మేపడం, వ్యవసాయం, కూలి పనులు ఇలా ఒకటేమిటీ అన్ని పనులకు ఆడవాళ్లే బానిసలు.

పెళ్లయిన తర్వాత పుట్టింట్లో చేసిన పనినే తిరిగి  మెట్టినింట్లో చేయాలి. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చితే అన్ని పనులు చేయలేదు కాబట్టి.. భర్త రెండో పెళ్లి చేసుకోవడం ఆనవాయితీ. రెండో భార్య తిరిగి ఇంటెడు చాకిరీ మీద వేసుకోవాల్సిందే. పేదరికంలో ఉన్న వారు, వితంతువులు ఈ దారుణానికి ఎక్కువగా బలవుతున్నారు. వీరి ముఖ్యమైన పని నీటిని తేవడమే.. బిందె మీద రెండు బిందెలు పెట్టి వారు నీటి కోసం ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.

అంత దూరం వెళ్లిన తర్వాత కొద్దికొద్దిగా నీటిని తోడి.. బిందెల్లో నింపడానికి ఎన్ని గంటల సమయం పడుతుందో తెలియదు. అందుకే ఇక్కడి మహిళలను ‘‘వాటర్ వైఫ్స్‌’’ అని పిలుస్తారు. బాలికల్ని పెళ్లి చేసుకుంటే చాలా రోజుల వరకు వారు ఇంటికి సరిపడా నీటిని తీసుకోస్తారనే భావన అక్కడి పురుషుల్లో ఉంది. రెండు పెళ్లిళ్లు చేసుకుంటే ఓ భార్య పిల్లలకి, ఇంటికి కాపలాగా ఉంటే, నీటిని తేవడానికి ఇద్దరు భార్యలు అన్నట్లుగా ఇక్కడి మగవారి పరిస్థితి ఉంది.

1956 నుంచి దేశంలో బాహుభార్యత్వాన్ని కేంద్రప్రభుత్వం నిషేధించింది ( ముస్లింలకు, గోవాలని హిందువులకు తప్పించి) కానీ ఈ కరువు పీడత గ్రామాల్లో ఇంకా అనాచారం వర్థిల్లుతోంది. ఆడపిల్లల్ని ఇంకా బానిసలుగా.. చెప్పిన పని చేసే కూలీగా చూడటం వల్లనే దేశంలో ఇంకా ఇలాంటి దురాచారాలు స్త్రీల జీవితాలను నాశనం చేస్తూనే ఉంటాయి.

click me!