
రాజస్థాన్ : తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలని వారిని తను కొన్న కారులోనో.. స్కూటర్ మీదో.. తిప్పి నగరమంతా చూపించాలని.. వారు గర్వపడేలా చేయాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని చాలా కష్టంగా ఉంటాయి. కానీ.. ఇలాంటి కలను ఓ విమాన పైలెట్ సాకారం చేసుకున్నాడు. తనను కన్న వారికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ మరుపురాని క్షణాలను వారికి అందించాడు. ఎలాగంటే.. తాను పైలెట్గా విధులు నిర్వహిస్తున్న విమానంలోనే తల్లిదండ్రులను ఢిల్లీ నుంచి స్వస్థలమైన రాజస్థాన్ లోని జైపూర్ కి తీసుకువెళ్ళడమే అతను చేసిన పని.
టూ వీలర్, ఆటో, కారు.. ఇలా ఏ వాహనం కొన్నా ముందుగా.. తల్లిదండ్రులకు, తో బుట్టువులకు చూపించుకోవడం.. వారిని ఎక్కించుకుని ఒక రౌండ్ కొట్టి రావడం సంతోషకరమైన విషయం. అలా ఆ కొడుకు కూడా తన సంతోషాన్ని పంచుకోవాలనుకున్నాడు. అయితే తాను నడిపేది.. ఏ బుల్లెట్ బండో.. కారో.. లేదా జీపో కాదు.. విమానం.. అతను పైలట్.. తాను విమానం నడిపుతూ తల్లిదండ్రులను అందులో తిప్పాలనుకున్నాడు. దీనికోసం వారికి స్వీట్ సర్ ఫ్రైజ్ కూడా ఇచ్చాడు.
అయితే, వారికి విమానం ఎక్కిన తరువాత కాని దాని పైలెట్ తన కుమారుడే అని తెలియలేదు. ఊహించని ఈ పరిణామానికి వారు ఎంతో ఆనందానికి లోనయ్యారు. పైలెట్ కమల్ కుమార్ దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోలో చూపించిన దాని ప్రకారం పైలెట్ తల్లిదండ్రులు ఢిల్లీ-జైపూర్ విమానం ఎక్కారు అయితే తాము ప్రయాణిస్తున్న విమానంలో విధుల్లో ఉన్నది తన కుమారుడే అన్న విషయం అప్పటికి వారికి తెలియదు. అంతలోనే ఊహించని విధంగా ప్రవేశ ద్వారం వద్ద అతడు వారికి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే తల్లి అతని దగ్గరికి వెళ్లి ప్రేమగా కొడుకు చేయి పట్టుకుని మురిసిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు ఆ పైలట్.
‘పైలెట్ గా విధులు ప్రారంభించినప్పటి నుంచి ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నా.. చివరికి జైపూర్ లోని ఇంటికి వారిని తీసుకువెళ్లే అవకాశం దక్కింది.. ఇది చాలా గొప్ప అనుభూతి’ అని రాసుకోస్తూ ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది. ప్రతి పైలెట్ కల ఇది అని ఒకరు కామెంట్ పెట్టగా.. చాలా హృద్యంగా ఉంది అంటూ మరొకరు స్పందించారు.