
భోపాల్: ఆ ప్రభుత్వ ఉద్యోగికి ముగ్గురు భార్యలు ఉన్నారు. వారు స్థానిక ఎన్నికల బరిలోకి దిగారు. గ్రామ సర్పంచ్‌గా ఇద్దరు భార్యలు రేసులో నిలబడ్డారు. ఒకరిపై ఒకరు పోటీ చేస్తూ.. నామినేషన్‌లలో తమ భర్తగా ఒకే వ్యక్తిని పేర్కొనడంతో ఎన్నికల అధికారికి ఈ విషయం తెలిసింది. ఇదంతా అధికారికంగా జరుగుతున్నది. మరొక భార్య కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలబడింది. కానీ, ఆ మూడో భార్య గురించిన సమాచారాన్ని ఆ ప్రభుత్వ ఉద్యోగి దాచి పెట్టారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి కనుగొని పై అధికారులకు రిపోర్టు సమర్పించారు. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం సంగ్రౌలీ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో సరాయ్ నగర్ పరిషద్ గ్రామ కార్యదర్శి సుఖ్రామ్ సింగ్ భార్యలు పోటీకి దిగారు. ఇద్దరు భార్యలు సర్పంచ్ పదవి కోసం పోటీ చేశారు. ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన వీరిద్దరూ తమ భర్తగా సుఖ్రామ్ సింగ్‌ను తమ నామినేషన్‌లో ప్రస్తావించారని దియోసార్ జనపద్ పంచాయత్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ బీకే సింగ్ జిల్లా పంచాయత్ సీఈవోకు రిపోర్టు ఇచ్చాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేసే అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు.
దీంతో వెంటనే ఈ డిపార్ట్‌మెంట్‌లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ కుటుంబ సభ్యలు వివరాలు సమర్పించాలని ఆదేశాలు వెలువడినట్టు బీకే సింగ్ వివరించారు.
దీనిపై విలేజ్ సెక్రెటరీ సుఖ్రామ్ సింగ్ సర్పంచ్ పదవి కోసం పోటీ చేస్తున్న తన ఇద్దరు భార్యల వివరాలను పంచాయత్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించారు. కానీ, అవే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న మూడో భార్య గీతా సింగ్ వివరాలను ఉద్దేశ్యపూర్వకంగా దాచి పెట్టారు.
దీంతో సుఖ్రామ్ సింగ్‌కు షోకాజ్ నోటీసులు పంపారు. కానీ, ఆ నోటీసులకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
సుఖ్రామ్ సింగ్ ఇద్దరు భార్యలు కుసుకాలి సింగ్, గీతా సింగ్‌లు పిపర్‌ఖాడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. గీతా సింగ్ గతంలో సర్పంచ్‌గా చేశారు కూడా.
కాగా, సుఖ్రామ్ సింగ్ మరో భార్య ఉర్మిలా సింగ్ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఓ కథనం వెల్లడించింది.