డీజీసీఏ డైరెక్టర్ గా ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విక్రమ్ దేవ్ దత్ నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీసీఏ చీఫ్ గా ఉన్న అరుణ్ కుమార్ త్వరలోనే పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఫిబ్రవరి 28వ తేదీన విక్రమ్ దేవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తదుపరి డైరెక్టర్ గా విక్రమ్ దేవ్ దత్ నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ శనివారం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుత డీజీసీఏ చీఫ్‌గా ఉన్న అరుణ్ కుమార్ పదవీ విరమణ చేసిన తరువాత ఫిబ్రవరి 28న దత్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
గత ఏడాది ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విక్రమ్ దేవ్ దత్ నియమితులయ్యారు. ఆయనే ఆ ఎయిర్‌లైన్స్‌కు ప్రభుత్వం నియమించిన చివరి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. 2022లో ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించారు. కాగా.. డీజీసీఏ డైరెక్టర్ జనరల్‌గా ఆయన నియామకం భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా, వేతనం ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.
విక్రమ్ దత్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, కేంద్ర పాలిత ప్రాంతం (ఏజీఎంయూటీ) కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దత్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన అండమాన్, నికోబార్ దీవుల ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు.
లక్నో విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు.. కట్ చేస్తే.. నిందితుడి అరెస్ట్
త్వరలో పదవి విరమణ చేయబోతున్న అరుణ్ కుమార్ హర్యానా కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన జూలై 2019 నుండి ఏవియేషన్ రెగ్యులేటర్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. డీజీసీఏ అనేది భారతదేశంలో పౌర విమానయానాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ. ఇది ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) చట్టం-2020 ప్రకారం చట్టబద్ధమైన సంస్థగా మారింది.