
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ సివిల్ ఇంజినీర్ పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూల్చివేత పనులకు ఎలాంటి నోటీసులు లేకుండానే అధికారులు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటన థాణే జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని మీరా భయాందర్ ఎమ్మెల్యే గీతా జైన్. ఆమె నియోజక వర్గంలోని భయాందర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులు కొన్ని నిర్మాణాల కూల్చివేత పనులకు ప్రారంభించారు. అయితే.. ఎలాంటి నోటీసులు లేకుండానే అధికారులు అక్రమంగా వచ్చి కూల్చివేత పనులు చేపట్టారని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానికులు ఆమెకు అందించారు. వెంటనే ఘటన స్థలానికి వచ్చిన ఆమె సంబంధిత అధికారులను, ఇంజినీర్ ను ప్రశ్నించారు.
అయితే.. అధికారులు సమాధానమిచ్చిన తీరు ఆమెకు నచ్చలేదు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ తరుణం పక్కనే ఉన్న ఇంజినీర్ ను చొక్కపట్టుకుని.. చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటనను అక్కడికక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
స్థానికుల కథనం ప్రకారం.. వర్షాకాలానికి ముందు భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజల ఇళ్లను కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే గీతాజైన్ ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటున్న ఇంజనీర్‌ను చెంప చెల్లుమనిపించారు. అధికారులకు క్లాస్ పీకుతుండగా ఇంజనీర్ నవ్వడం వల్లే అతడిని ఎమ్మెల్యే కొట్టారని చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. అక్కడికక్కడే ఉన్న అధికారులందరినీ ఎమ్మెల్యే తిట్టడం వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వస్తునాయి.