సీజేఐ చంద్రచూడ్ సమక్షంలో జడ్జీల నియామకంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కామెంట్లు

By Mahesh KFirst Published Dec 3, 2022, 2:32 PM IST
Highlights

సీజేఐ చంద్రచూడ్ సమక్షంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ జడ్జీల నియామకంపై కామెంట్లు చేశారు. కొలీజియం వ్యవస్థ స్థానంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ యాక్ట్ గురించి ప్రస్తావించారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని వివరించారు.
 

న్యూఢిల్లీ: నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ యాక్ట్‌ (ఎన్‌జేఏసీ యాక్ట్)ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై పార్లమెంటులో కనీసం గుసగుసలు కూడా వినిపించలేదని, ఇది చాలా సీరియస్ ఇష్యూ అని దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని పేర్కొన్నారు. దీని గురించి బయటి ప్రపంచానికీ ఏమీ తెలియలేదని తెలిపారు. కొలీజియం వ్యవస్థకు బదులుగా ఎన్‌జేఏసీ యాక్ట్‌ను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమక్షంలోనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమోదించిన చట్టంలో న్యాయపరమైన చిక్కుముడి ఏమైనా ఉంటే అప్పుడు దాన్ని కోర్టులు సమీక్షిస్తాయని ఆయన పేర్కొన్నారు. కానీ, ఎక్కడ కూడా ఒక చట్టాన్ని రద్దు చేయాలని లేదని అన్నారు.

ఢిల్లీలో ఎల్ఎం సింఘ్వి స్మారక ఉపన్యాసాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఇచ్చారు. ఇదే కార్యక్రమానికి సీజేఐ డీవై చంద్రచూడ్ కూడా హాజరయ్యారు. రాజ్యాంగ పీఠికలో భారతీయులైన మేము అని ఉంటుందని, ప్రజల నిర్ణయాన్ని పార్లమెంటులో వ్యక్తీకరిస్తుందని ధన్కర్ అన్నారు.అంటే అధికారం ప్రజల పక్షాన ఉంటుందని వివరించారు.

ఎన్‌జేఏసీ యాక్ట్ గురించి మాట్లాడుతూ 2015-16 కాలంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం గురించి పార్లమెంటు చర్చిస్తున్నదని తెలిపారు. ఆ బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవంగా ఓటేసిందని, రాజ్యసభలోనూ దాదాపు ఏకగ్రీవమే అయిందని వివరించారు. ప్రజల అభీష్టం ఈ పార్లమెంటులో వెల్లడైందని అన్నారు. కానీ, దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని పేర్కొన్నారు. ఈ విషయం బయటి ప్రపంచానికి కనీసం తెలియకుండానే పోయిందని అన్నారు.

Also Read: వ్యవస్థను గందరగోళపరచకండి: కొలీజియం అంశంపై సుప్రీంకోర్టు

ఆ నిర్ణయంపట్ల తాను కంగారుపడ్డానని అన్నారు. దాని గురించి పార్లమెంటులో కనీసం గుసగుసలు కూడా వినిపించలేవని తెలిపారు. ఆ నిర్ణయాన్ని అలా తీసుకున్నారని, ఇది చాలా సీరియస్ ఇష్యూ అని వివరించారు. సుప్రీంకోర్టు రూపొందించిన బేసిక్ స్ట్రక్చర్‌ను ఏమాత్రం మార్పులు లేకుండానే స్వీకరించేశాం అని తెలిపారు.

‘నేనొక సాధారణ న్యాయ విద్యార్థిగా మాట్లాడుతున్నా.. పార్లమెంటు సార్వభౌమత్వాన్ని తక్కువ చేయవచ్చునా? గత పార్లమెంటులు తీసుకున్న వాటికి తదుపరి పార్లమెంటులు కట్టుబడి ఉండాలా?’ అని అడిగారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలు సమన్వయంలో పని చేయడమే ప్రజాస్వామ్య మనుగడకు, అభివృద్ధికి కీలకం అని తెలిపారు.

click me!