‘పద్మ శ్రీ నాకు కాదు.. జూనియర్ ఆర్టిస్టులకు సరిపోతుంది’.. అవార్డు తిరస్కరించిన వెటరన్ సింగర్

By Mahesh KFirst Published Jan 26, 2022, 12:46 PM IST
Highlights

పద్మ అవార్డును మరొకరు తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వెటరన్ సింగర్ సంధ్య ముఖర్జీ తనకు పద్మ శ్రీ అవార్డు సరితూగదని పేర్కొన్నారు. ఆ అవార్డు జూనియర్ ఆర్టిస్టులకు సరిపోతుందని తెలిపారు. 90 ఏళ్ల వయసుతో సుమారు ఎనిమిది దశాబ్దాల గాయనిగా రికార్డు ఉన్న తనకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించడమంటే.. తన స్టేచర్‌ను తగ్గించడమేనని ఆమె కూతురు సౌమీ సేన్ గుప్తా వెల్లడించారు. ఇదే రాష్ట్ర మాజీ సీఎం, సీపీఎం సీనియర్ లీడర్ బుద్ధదేవ్ భట్టాచర్య కూడా పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అందించే ఉన్నతమైన పురస్కారాల్లో పద్మ శ్రీ(Padma Shri Award) ఒకటి. ఈ పురస్కారం పొందడానికి ఎంతో మంది ప్రముఖులు, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నవారు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ అవార్డుకు ఎంపికైన వారు సంతోష డోలికల్లో తేలియాడుతారు. పద్మ అవార్డులు పొందడం నిజంగా ప్రముఖులకు ఎంతో గౌరవంగా ఉంటుంది. కానీ, ఈ సారి ఈ అవార్డులను ఇద్దరు వ్యక్తులు తిరస్కరించారు. వారిద్దరూ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే కావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్(West Bengal) మాజీ సీఎం బుద్దదేబ్ భట్టాచర్య పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించారు. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయని సంధ్య ముఖర్జీ(Veteran Singer Sandhya Mukherjee) కూడా పద్మ శ్రీ అవార్డును తిరస్కరించారు. వీరిదదరూ చెప్పిన కారణాలూ అంతే ఆసక్తికరంగా ఉన్నాయి.

90 ఏళ్ల వెటరన్ సింగర్ సంధ్య ముఖర్జీ (సంధ్య ముఖోపాధ్యాయ్) కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన పద్మ శ్రీ అవార్డును తిరస్కరించారు. తన హోదా ఉన్న వ్యక్తికి ఈ అవార్డు సరికాదని, ఆ అవార్డును జూనియర్ ఆర్టిస్టులకు సరిపోతుందని పేర్కొన్నారు. సంధ్య ముఖర్జీ కూతురు సౌమీ సేన్‌గుప్తా ఈ విషయంపై మాట్లాడారు. పద్మ శ్రీ అవార్డు కోసం సంధ్య ముఖర్జీ పేరును చేరుస్తున్నామని అధికారులు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారని వివరించారు. పద్మ శ్రీ అవార్డు ప్రకటించనున్నవారి జాబితాలో తన పేరు చేర్చవద్దని తన తల్లి ఆ అధికారులకు వివరించినట్టు పేర్కొన్నారు. పద్మ శ్రీ అవార్డు కోసం ఆమె పేరును ప్రకటించాలనుకోవడాన్ని అవమానంగా ఫీల్ అయ్యారని తెలిపారు. 90 ఏళ్ల వయసులో తనకు ఈ అవార్డు ప్రకటించడం సరికాదని ఆమె అభిప్రాయపడినట్టు చెప్పారు. రిపబ్లిక్ డే రోజున పద్మ శ్రీ అవార్డు ప్రకటించే వారి జాబితాలో తన పేరును చేరుస్తున్నామని ముందస్తు సమ్మతి కోసం అధికారులు ఆమెకు మంగళవారం ఫోన్ చేశారు.

బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేబ్ తన అవార్డును తిరస్కరించడానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. కానీ, సంధ్య ముఖర్జీ ఈ అవార్డును తిరస్కరించడం కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆమె కూతురు సౌమీ సేన్‌గుప్తా వెల్లడించారు. 90 ఏళ్ల వయసు ఉన్న తన తల్లి సుమారు ఎనిమిది దశాబ్దాలుగా గాయనిగా సేవలు అందిస్తున్నారని, ఈ సందర్భంలో ఆమెకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించడం ఆమె  స్టేచర్‌ను తగ్గించడమేనని సేన్ గుప్తా కూడా అభిప్రాయపడ్డారు. పద్మ శ్రీ అవార్డు జూనియర్ ఆర్టిస్టులకు సరిపోతుందని, గీతా శ్రీ సంధ్య ముఖోపాధ్యాయ్‌కు కాదని వివరించారు. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పాటల అభిమానులు ఫీల్ అవుతున్నారని తెలిపారు.

కాగా, మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచర్య అవార్డును తిరస్కరణపై స్పందిస్తూ..  తనకు అవార్డును అందించబోతున్నామనే విషయాన్ని తనకు ముందుగా తెలుపలేదని తెలిపారు. ఒక వేళ తనకు ముందే చెప్పినా.. ఆ అవార్డును తిరస్కరించేవారని స్పష్టం చేశారు.

ఇలా అవార్డును తిరస్కరించడం చాలా అరుదు. గతంలో ఫిలిం రైటర్ సలీమ్ ఖాన్, ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ సహా పలువురు తిరస్కరించారు.

click me!