కేరళ: శైలజను కాదని హెల్త్ మినిస్టర్‌గా పగ్గాలు.. ఎవరీ వీణా జార్జ్

By Siva KodatiFirst Published May 21, 2021, 5:55 PM IST
Highlights

కరోనా కాలంలో అందరి ప్రశంసలు అందుకున్న మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజను కూడా పక్కన పెట్టడం దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరదీసింది. శైలజ స్థానంలో వీణా జార్జ్ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. విజయన్ రెండోసారి ముఖ్యమంత్రిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే వరుసగా ఎవరినీ రెండోసారి మంత్రిగా నియమించకూడదనే పార్టీ నిర్ణయం మేరకు అందరూ కొత్తవారినే క్యాబినెట్‌లోకి తీసుకున్నారు సీఎం. ఇంత వరకు బాగానే వున్నా.. కరోనా కాలంలో అందరి ప్రశంసలు అందుకున్న మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజను కూడా పక్కన పెట్టడం దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరదీసింది. శైలజ స్థానంలో వీణా జార్జ్ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

1976 ఆగస్ట్ 3న తిరువనంతపురంలో జన్మించిన వీణ ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో స్టేట్ ర్యాంకర్‌గా నిలిచారు. బీఈడీ కూడా పూర్తి చేశారు. అనంతరం టీవీ జర్నలిజంలోకి ప్రవేశించారు. కైరళి, మనోరమ, టీవీ న్యూస్ వంటి ప్రముఖ మలయాళ ఛానళ్లలో నూస్ యాంకర్‌గా, న్యూస్ ఎడిటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌ స్థాయికి ఎదిగారు. తద్వారా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యత నిర్వర్తించిన తొలి మహిళా జర్నలిస్ట్‌గా వీణ నిలిచారు. 

విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న వీణ... కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే సీపీఐ (ఎమ్) విద్యార్థి విభాగం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హయ్యర్ సెకెండరీ గ్రేడ్ స్కూల్ టీచర్ అయిన జార్జ్ జోసెఫ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

Also Read:ప్రపంచం ప్రశంసించినా శైలజ టీచర్‌కు దక్కని చోటు: విజయన్ ఒక్కడే, సీపీఎం అనూహ్య నిర్ణయం

అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ప‌ట్టణ‌మిట్ట జిల్లాలోని ఆర‌న్‌మూల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2016లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరుసగా అదే నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. రెండో విడతలో ఏకంగా కేబినెట్‌లో కీలకమైన ఆరోగ్య శాఖ మంత్రిగా స్థానం సంపాదించారు. 

మరోవైపు కేర‌ళ‌ను కరోనా సహా పలు విపత్కర పరిస్ధితుల్లో ఆదుకున్న మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ‌కు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి పెరుగుతోంది. ఆమెను కేబినెట్‌లోకి తీసుకోవాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. సినీ ప్రముఖులు సైతం ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

అయినప్పటికీ వరుసగా రెండోసారి ఎవరినీ మంత్రిని చేయకూడదనే పార్టీ నిర్ణయం మేరకు శైలజను పక్కన పెట్టాల్సి వచ్చిందని స్వయంగా సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.

కాగా, శైలజ సైతం పార్టీ నిర్ణయానికే కట్టుబడి వుంటానని తెలిపారు. సీపీఎంలో పదవుల కోసం పనిచేసేవారు లేరని, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటమే కార్యకర్తల పని అని చెప్పారు. 
 

click me!