మరో రాష్ట్రంలోనూ హిందీలో ఎంబీబీఎస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం.. వివరాలివే

By Mahesh KFirst Published Nov 5, 2022, 2:25 PM IST
Highlights

మన దేశంలో ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందించనున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే దారిలో ఉత్తరాఖండ్ కూడా వెళ్లుతున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ కూడా ఎంబీబీఎస్‌ను హిందీలో అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
 

న్యూఢిల్లీ: మన దేశంలో ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందించనున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచిన సంగతి తెలిసిందే. హిందీలో ప్రిపేర్ చేసిన ఎంబీబీఎస్ పుస్తకాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే దారిలో ఇప్పుడు మరో రాష్ట్రం కూడా నడుస్తున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందించడానికి నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే హిందీలో ఎంబీబీఎస్ కోర్సును విద్యార్థులకు అందించాలని కసరత్తులు మొదలు పెట్టింది.

ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ వెల్లడించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. మన దేశంలో ఎంబీబీఎస్‌ను హిందీ భాషలో అందించనున్న రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. కేంద్ర ప్రభుత్వం హిందీ భాషకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ధన్ సింగ్ రావత్ శుక్రవారం తెలిపారు.

Also Read: గుడ్ న్యూస్: ఎంబీబీఎస్, బీడీఎస్ బీ కేటగిరి ఆడ్మిషన్లలో 85 శాతం తెలంగాణకే

ఈ నిర్ణయం ఆచరణ రూపం దాల్చడానికి రాష్ట్ర వైద్య విద్యా శాఖ నలుగురు నిపుణులతో ఓ కమిటీ వేసినట్టు ఆయన తెలిపారు. పౌరి జిల్లా శ్రీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సీఎంఎస్ రావత్ ఈ కమిటీకి సారథ్యం వహిస్తారని వివరించారు. ఈ కమిటీ మధ్యప్రదేశ్ రూపొందించిన ఎంబీబీఎస్ హిందీ సిలబస్‌ను అధ్యయనం చేస్తుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఎంబీబీఎస్ హిందీ సిలబస్‌ను రూపొందిస్తారని చెప్పారు.

కమిటీ రూపొందించే ఈ సిలబస్ ముసాయిదా, ఇతర ఫార్మాలిటీలు అందిన తర్వాత వచ్చే అకడమిక్ సెషన్‌లో హిందీలో ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

click me!