మన దేశ తొలి ఓటరు శ్యామ్ నేగి కన్నుమూత.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

By Mahesh K  |  First Published Nov 5, 2022, 12:55 PM IST

స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ సరణ్ నేగి తన 106వ యేటా తుది శ్వాస విడిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ నెల 2వ తేదీన చివరిసారి ఓటు వేసి ఈ రోజు మరణించారు. ఆయన మరణానికి ప్రధాని మోడీ, ఎన్నికల సంఘం, సీఎం జైరాం ఠాకూర్ సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో నేగి అంత్యక్రియలు జరగనున్నాయి.
 


న్యూఢిల్లీ: స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యామ్ సరణ్ నేగి (106) ఈ రోజు మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాల్పాలో 14వ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన మరుసటి రోజే ఆయన తుదిశ్వాస విడిచారు. అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఓటు వేయడంపై ఎన్నో తరాలను జాగరూకతం చేసిన శ్యామ్ నేగి మరణంపై పీఎం మోడీ ట్వీట్ చేశారు. శ్యామ్ నేగి జీవితం ఎన్నికల్లో పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తుందని, అలాగే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

నవంబర్ 2వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ద్వారా శ్యామ్ నేగి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వతంత్ర భారత దేశంలో 1952 జనవరి, ఫిబ్రవరిల్లో జనరల్ పోల్స్ నిర్వహించారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో మంచు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 1951 అక్టోబర్‌లోనే నిర్వహించారు. ఈ ఎన్నికలో తొలిసారి.. అంటే స్వతంత్ర భారత్ నిర్వహించిన తొలి ఎన్నికలో తొలిసారిగా శ్యామ్ సరణ్ నేగి ఓటు వేశారు. అప్పటి నుంచి ఆయన పేరు చరిత్రలో స్థిరపడిపోయింది.

Latest Videos

undefined

Also Read: మొయిన్‌పురి లోక్‌సభ స్థానంతోపాటు 5 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

అప్పటి నుంచి ఆయన ప్రతి ఎన్నికలో ఓటు వేశారు. ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఓటు వేశారు. చివరిసారిగా, 34వ సారి నవంబర్ 2వ తేదీన ఓటు వేశారు.

శ్యామ్ నేగి మరణానికి భారత ఎన్నికల సంఘం సంతాపం తెలిపింది. స్వతంత్ర భారతంలో తొలి ఓటరు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో అచంచల విశ్వాసం కల వ్యక్తి అని పేర్కొంది. శ్యామ్ సరణ్ నేగి మరణానికి నివాళి అర్పిస్తున్నట్టు ట్వీట్ చేసింది. దేశానికి ఆయన చేసిన సేవకు తాము శాశ్వతంగా రుణపడి ఉన్నామని వివరించింది.

కిన్నౌర్‌కు చెందిన శ్యామ్ నేగి మరణం బాధాకరం అని, నవంబర్ 2న 34వ సారి అసెంబ్లీ ఎన్నికలో పోస్టల్ ఓటు వేశారని సీఎం జైరామ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి అని ట్వీట్ చేశారు.

Also Read: ఓటేసిన భారత తొలి ఓటరు

కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అమందీప్ గార్గ్ స్పందిస్తూ.. శ్యామ్ నేగి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.

కిన్నౌర్ జిల్లాలో 1917లో జన్మించిన శ్యామ్ నేగి లోక్ సభ ఎన్నికల్లో 16 సార్లు ఓటు వేశారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన నేగి.. ఎప్పుడూ ఓటు వేసే అవకాశాన్ని మిస్ చేసుకోలేదు. చివరి సారి ఆయన నవంబర్ 2న ఓటు వేసినప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

యువత ఓటు వేసే బాధ్యతను మరువ కుండా దేశాన్ని బలోపేతం చేయడంలో పాలుపంచుకోవాలని పిలుపు ఇచ్చారు. ఓటు హక్కు పట్ల గర్వపడాలని, ఈ హక్కు ద్వారా దేశానికి నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తిని ఎంచుకోగలమని వివరించారు. ఆయన మృతి పై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లోనూ బాధ వ్యక్తం అవుతుండటం గమనార్హం.

click me!