ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే.. ?

By Siva KodatiFirst Published Jul 3, 2021, 2:26 PM IST
Highlights

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సీఎం పదవిని ఎవరు చేపట్టనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.  అయితే, దీనిపై ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌషిక్ శనివారం సంకేతాలు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనే ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని మీడియాకు తెలిపారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సీఎం పదవిని ఎవరు చేపట్టనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.  అయితే, దీనిపై ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌషిక్ శనివారం సంకేతాలు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనే ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం జరిగే బీజేపీ శాసనసభాపక్షా సమావేశంలో కొత్త శాసనసభా పక్ష నేత ఎంపిక జరుగుతుందని కౌషిక్ వెల్లడించారు.

పార్టీ ఇన్‌చార్జి, సూపర్‌వైజర్ డెహ్రాడూన్ వస్తున్నారని.. శాసనసభ్యుల సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని ఆయన చెప్పారు. ఇదే సమావేశంలో తాము కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ని కలిసి విన్నవిస్తామని కౌషిక్ చెప్పారు. ఎమ్మెల్యేల నుంచే ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి అని మదన్ కౌషిక్ పేర్కొన్నారు. కాగా, శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి, ఉత్తరాఖండ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి నరేంద్ర సింగ్ తోమర్ ఇప్పటికే డెహ్రాడూన్ చేరుకున్నారు.

Also Read:ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్ సింగ్ రాజీనామా?

కాగా, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను గవర్నర్‌ బేబీ రాణి మౌర్యకు అందజేశారు. అంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తీరత్‌ సింగ్‌.. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. ఎంపీగా ఉన్న తీరత్‌ను బీజేపీ అధిష్ఠానం నాలుగు నెలల కిందట త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో సీఎంగా నియమించింది. దీంతో ఆయన ఆరు నెలల్లోపే శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు నెలలు పూర్తికాగా.. సెప్టెంబర్‌ 10 నాటికి ఆరు నెలలు అవుతుంది. అయితే, రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కారణంగా ఉప ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా తీరత్ సింగ్ రాజీనామా చేశారు. 

click me!