
ఉత్తరప్రదేశ్‌లోని డియోరిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ఎస్‌యూవీ వాహనం ఢీకొన్న ఘటనలో కనీసం ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గౌరీబజార్-రుద్రాపూర్ రోడ్డులోని ఇందూపూర్ కాళీ మందిర్ మలుపు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను రామ్ ప్రకర్ సింగ్ (55), వశిష్ట్ సింగ్ (42), ఉమా పాండే (45), అంకుర్ పాండే (18), రామానంద మౌర్య (32), రామ్ సుభాగ్ గుప్తా (50)గా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
‘‘రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఎస్‌యూవీ వాహనం రుద్రపూర్ రోడ్డు మీదుగా వెళ్తుంది. కాళీ దేవాలయం సమీపంలోకి రాగానే.. ఎదురుగా వచ్చిన బస్సు ఆ వాహనాన్ని ఢీకొట్టింది’’ అని డియోరియా పోలీసు సూపరింటెండెంట్ శ్రీపతి మిశ్రా తెలిపారు. ఈ క్రమంలోనే ఎస్‌యూవీ బోల్తా పడిందని చెప్పారు.
ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం
డియోరియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో గాయపడినవారిని మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.