
Sharad Pawar: ఇటీవల దేశంలో చోటుచేసుకున్న విద్వేష ప్రసంగాలు, మతపరమైన హింసపై ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ స్పందించారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని శరద్ పవార్ ఆరోపించారు. దేశంలో రామ నవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనల గురించి ప్రస్తావించారు.
దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయనీ, మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎంవిఎ ప్రభుత్వంలోని ఎన్‌సిపి ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని సృష్టించడంలో ముందంజలో ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మతపరమైన భావజాల వ్యాప్తి "ఆందోళన కలిగించే విషయం" అని అన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎడిబుల్ ఆయిల్ ధరల పెరుగుదల వంటి సాధారణ పౌరులకు భారంగా మారుతున్నాయని విమర్శించారు. బీజేపీ, దాని సహచరులు దేశంలో మత విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు వారి మధ్య మత సామరస్యం ఉండేలా వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తునట్టు పేర్కొన్నారు.
రామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్ వంటి పలు రాష్ట్రాలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే.. ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపులోనూ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది పోలీసులతో పాటు సామాన్య పౌరుడు గాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే.. మసీదులపై లౌడ్ స్పీకర్లకు వ్యతిరేక ఉద్యమం నడిపిస్తున్నారు. అన్ని మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాల్సిందేనని, లేదంటే మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా పారాయణాన్ని స్పీకర్లలో వినిపిస్తామంటూ రాజ్ థాకరే లోగడే హెచ్చరించారు. మే 3 నాటికి లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర సర్కారుకు గడువు కూడా పెట్టారు. దీనిపై తాజాగా స్పందిస్తూ మే 3 తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు. రాజ్ థాకరే డిమాండ్‌కు బీజేపీ మద్దతు తెలిపింది.
ఈ క్రమంలో దేశంలో ఇటీవల చోటుచేసుకున్న విద్వేష ప్రసంగాలు, మతపరమైన హింసకు సంబంధించి కాంగ్రెస్ సహా 13 విపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని చాలా మంది నాయకులు ఆకాంక్షించారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లిఖితపూర్వకంగా తెలియజేశారని చెప్పారు.