
Uttar Pradesh : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో యోగి సర్కార్ ఫైర్ అండ్ సేఫ్టీని చాలా పకడ్బందీగా అమలుచేసింది. తమ నైపుణ్యం, వ్యూహం, త్వరిత స్పందనతో ఫైర్ సిబ్బంది ప్రయాగ్‌రాజ్ లో అద్భుతంగా పనిచేశారు. పెద్ద అగ్ని ప్రమాదాలు జరక్కుండా అడ్డుకుని ప్రాణ నష్టం లేకుండా చూశారు. దీంతో వీరికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది… తాజాగా ఈ బృందాన్ని మహారాష్ట్రలో సత్కరించారు. ప్రయాగ్‌రాజ్ ఫైర్ సేఫ్టీ మోడల్‌ను ప్రశంసించి, గౌరవించిన మూడో రాష్ట్రం మహారాష్ట్ర.
మహారాష్ట్రలోని ముంబై గోరేగావ్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో మహాకుంభ్ మేళా 2025కి నాయకత్వం వహించిన అగ్నిమాపక, అత్యవసర సేవల బృందానికి 'ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు'తో సత్కరించారు. ఇది ఫైర్ అండ్ సేఫ్టీ రంగంలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఈ అవార్డును బృందానికి అందించారు. ఈ సత్కారం పొందిన వారిలో మహాకుంభ్‌లో బృందానికి నాయకత్వం వహించిన ఐపీఎస్ పద్మజా చౌహాన్, మహాకుంభ్ ఫైర్ సేఫ్టీ నోడల్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ శర్మ, చీఫ్ ఫైర్ ఆఫీసర్ అంకుశ్ మిట్టల్ ఉన్నారు.
ప్రయాగరాజ్ లో అగ్నిమాపక, అత్యవసర సేవలు, మహిళా, శిశు భద్రతా సంస్థకు నాయకత్వం వహిస్తున్న ఏడీజీ పద్మజా చౌహాన్ మాట్లాడుతూ… మహాకుంభ్-25లో ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో యూపీ అగ్నిమాపక, అత్యవసర సేవల అధికారులు పనిచేశారని అన్నారు. ఎంతో కష్టపడి పనిచేసి పెద్ద అగ్ని ప్రమాదాలను విజయవంతంగా అదుపు చేసారని… ప్రాణ నష్టం జరక్కుండా చూశారన్నారు.
మహాకుంభ్‌లో నోడల్ అధికారిగా ఉన్న సీఎఫ్‌ఓ ప్రమోద్ శర్మ మాట్లాడుతూ… సీఎం యోగి సురక్షిత మహాకుంభ్ సంకల్పాన్ని సక్సెస్ చేయడంలో యూపీ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారులు విజయవంతం అయ్యారన్నారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా మహాకుంభ్-2025 లో తమ పాత్ర పోషించారని అన్నారు.
మహాకుంభ్ బృందం మహారాష్ట్రకు ముందు గోవా, ఢిల్లీలలో కూడా తమ నైపుణ్యానికి అవార్డులు అందుకుంది. మహాకుంభ్ ముగిసిన తర్వాత గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, అగ్నిమాపక, అత్యవసర సేవలకు నాయకత్వం వహిస్తున్న ఏడీజీ పద్మజా చౌహాన్ (IPS), నోడల్ ఆఫీసర్ సీఎఫ్‌ఓ ప్రమోద్ శర్మను సత్కరించారు. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని యశోభూమి కన్వెన్షన్ హాల్‌లో జరిగిన FSAI (ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) అంతర్జాతీయ కార్యక్రమంలో వీరిని ప్రశంసిస్తూ సత్కరించారు.