
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో మునిగి ఉన్నాయి. అంబేడ్కర్ నగర్ వాసులు ఇంకా వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. వీరికి రిలీఫ్ మెటీరియల్ అందిస్తూ అంబేడ్కర్ నగర్ జిల్లా మెజిస్ట్రేట్ వ్యాఖ్యలను కొందరు రికార్డు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చ మొదలైంది. ఆ వీడియోలో వరద బాధితులను ఉద్దేశిస్తూ డీఎం మాట్లాడుతున్న వ్యాఖఖ్యలు ఉన్నాయి. ‘వరద ప్రభావిత ప్రాంతంలో డోర్ టు డోర్ సర్వీస్ చేయడానికి రిలీఫ్ మెటీరియల్ అందించడానికి ప్రభుత్వం జొమాటో నడపట్లేదు. మీకు అవసరమైతే.. మీకు క్లోరిన్ టాబ్లెట్లు, ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వైద్య సేవలు అందిస్తాం. అందుకోసమే ఇక్కడ ఫ్లడ్ పోస్టులను ఏర్పాటు చేశాం. అందరూ ఈ పోస్టుల వద్దకే రావాలి. డోర్ టు డోర్ సేవలు అందించడానికి ప్రభుత్వమేమీ జొమాటో నడపట్లేదు’ అని పేర్కొన్నారు.
అలాగే, ఆహారం కోసం వారు ఒక సమయాన్ని కేటాయించాలని ఆదేశించారు. అలాగే, రోజు ఉదయం తినడానికి వచ్చిన వారి సంఖ్య ఆధారంగా తదుపరి పూటలకు భోజనం ఏర్పాటు చేస్తామని అన్నారు. ‘మీరు ముందు అందరు కలిసి ఫ్లడ్ పోస్టు దగ్గర తినడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకోండి. ఉదయం తినడానికి ఎంతమంది అయితే వస్తారో.. ఆ సంఖ్య ఆధారంగానే సాయంత్రం కూడా ఆహారం వండుతాం’ అని వివరించారు.
ఉత్తరప్రదేశ్‌లో వరద నీళ్లు ప్రజల ఇళ్లకు వస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సెప్టెంబర్ 18న సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసిన అన్ని జిల్లాల్లోనూ సహాయ పనులు వేగవంతంగా చేపట్టాలని ఈ వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.