
Uttar Pradesh : వర్షాకాలంలో పాడైన రోడ్లకు మరమ్మతులు, అవసరమైన చోట్ల పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలే కాదు గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోడ్లని దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల కంటే ముందే సిద్దం చేయాలని సూచించారు. పండగల సమయంలో ప్రయాణాలు చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు సూచించారు. గత సంక్రాంతి సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే రోడ్లను బాగుచేసేందుకు యాక్షన్ ప్లాన్ చేపట్టారు… దీన్ని ఇప్పుడు యూపీ సీఎం యోగి ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాఖాపరమైన సమావేశంలో రోడ్ల మరమ్మతులు, గుంతలు లేని రోడ్ల ప్రచారం పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని రోడ్లన్నింటిని గుంతలు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు… ఇప్పటివరకు సగటున 21.67% పురోగతి సాధించినట్లు సీఎంకు అధికారులు వివరించారు.
సీఎం యోగి ఎన్‌హెచ్‌ఏఐ, పీడబ్ల్యూడీ, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటిపారుదల, చెరకు, చక్కెర అభివృద్ధి సహా అన్ని శాఖల నుంచి నివేదికలు తీసుకుని, అన్ని విభాగాలు సమాన వేగంతో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. పురోగతి నెమ్మదిగా ఉన్న విభాగాలు మరింత మెరుగ్గా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మరమ్మతు పనుల్లో కూడా వేగం పెంచాలని సీఎం కాస్త గట్టిగానే చెప్పారు.
పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో… నగరపాలక సంస్థలకు కేటాయించిన నిధులను సరిగ్గా, సకాలంలో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. పనుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే మేయర్ల అధికారాలపై పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
31,514 కి.మీ పొడవు గల రోడ్లను పునరుద్ధరణ పథకంలో చేర్చినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఇందులో లోక్ నిర్మాణ్ విభాగ్ 84.82% పురోగతిని నమోదు చేసిందన్నారు. పునరుద్ధరణ పనులు సకాలంలో పూర్తి కావాలని… ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యం ఉండకూడదని సీఎం యోగి ఆదేశించారు.
ప్రత్యేక మరమ్మతులు, పునరుద్ధరణ కోసం 2,750 కి.మీ రోడ్లను గుర్తించినట్లు సమావేశంలో తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ 62.99%, పట్టణాభివృద్ధి శాఖ 35.50%, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి శాఖ 48.77% పురోగతిని నమోదు చేశామన్నారు. లోక్ నిర్మాణ్ విభాగ్ సెప్టెంబర్ 30 నాటికి సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పండుగలను దృష్టిలో ఉంచుకుని 649 మార్గాలు సంతృప్తికరంగా ఉన్నాయని, 114 మార్గాలు అధ్వానంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ మార్గాలను వెంటనే బాగుచేసి, రాకపోకలను సులభతరం చేయాలని సీఎం ఆదేశించారు. పండుగల సమయంలో రోడ్ల పరిస్థితి రాష్ట్ర ప్రతిష్టతో ముడిపడి ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆయన అన్నారు.
రోడ్లను బాగు చేయాలనే నిర్ణయం రాష్ట్ర ప్రజల సౌకర్యం, భద్రతకు సంబంధించినదని సీఎం యోగి అన్నారు. కాబట్టి అధికారులు పారదర్శకత, సమయపాలన, బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పనులను రోజూ పర్యవేక్షించాలని, ప్రభుత్వ స్థాయికి క్రమం తప్పకుండా నివేదికలు పంపాలని సూచించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి ఉత్తర-దక్షిణ కారిడార్ అభివృద్ధిపై కూడా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు తూర్పు-పడమర దిశలో ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పుడు నేపాల్ సరిహద్దు నుంచి దక్షిణ జిల్లాల వరకు ఒక బలమైన ఉత్తర-దక్షిణ కారిడార్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం, జాతీయ రహదారుల పరిధిలోకి వచ్చే రోడ్ల విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ సహకారం తీసుకోవాలని, మిగిలిన మార్గాల విస్తరణ, నిర్మాణం రాష్ట్ర స్థాయిలో చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టులను కూడా ప్రతిపాదించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.