యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కుల గణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురుద్దేశంతోనే కుల గణన గురించి మాట్లాడుతున్నాయని ఆరోపించారు. ప్రధాని మోడీ సారథ్యంలో ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు.
న్యూఢిల్లీ: యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతి పక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుల గణన డిమాండ్‌ను బలంగా ముందుకు తెస్తున్నది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికల కోసమే కుల గణన డిమాండ్‌ను ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. ఎన్నికలు సమీపించినప్పుడే ప్రతిపక్షాలకు కులాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని యోగి అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్య లు తీసుకుంటున్నారని వివరించారు. ప్రధాని మోడీ సారథ్యంలో దేశం కొత్త పుంతలు తొక్కుతున్నదని, సరికొత్త శిఖరాలు అధిరోహిస్తున్నదని అన్నారు. గ్రామాలు, రైతులు, యువతకు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం దక్కుతున్నదని తెలిపారు. వీరంతా సుభిక్షమైన దారుల్లో వెళ్లుతున్నారని వివరించారు.
Also Read: కస్టడీలోని నిందితుడు పోలీసు కారుతో పరార్.. కొద్ది దూరం తర్వాత కారు వదిలాడు.. కానీ!
స్వాతంత్ర్యం పొందిన తర్వాత తొలిసారి ఇప్పుడు రైతులకు కనీస మద్దతు ధర అందుతున్నదని యోగి వివరించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద యేటా రూ. 6,000 రైతులకు అందుతున్నాయని, యూపీలో మూడు విడతల్లో 2.62 కోట్ల రైతులకు ఈ పథకం కింద డబ్బులు అందుతున్నా యని తెలిపారు. ప్రధాని మోడీ క్రీడలనూ ప్రోత్సహిస్తున్నదని వివరించారు.