అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పిల్లనిచ్చిన అత్తగారి దేశానికి రానున్నారు. వాన్స్ ఫ్యామిలీ ఇండియాలో మూడ్రోజులు పర్యటించనున్నారు. వాళ్లు పర్యటన ఇలా సాగనుంది...
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ఇండియా పర్యటనకు రానున్నారు జేడి వాన్స్. భార్య ఉషా వాన్స్ తో పాటు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ లతో కలిసి భారత్ రానున్నారు వాన్స్. ఉన్నతస్థాయి అధికారుల టీమ్ కూడా ఆయనవెంట రానుంది... అయితే అధికారిక కార్యక్రమాల కంటే వ్యక్తిగత కార్యక్రమాల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తున్నారు.
ఈనెల 21న ఆయన ఇండియాకు చేరుకుంటారు. మూడ్రోజులపాటు అంటే ఏప్రిల్ 24 వరకు పర్యటన కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీతో ఇండియాకు వచ్చినరోజే అంటే ఏప్రిల్ 21నే వాన్స్ భేటీ కానున్నారు. ఆర్థిక, రాజకీయ అంశాలపై మోదీ, వాన్స్ చర్చించే అవకాశాలున్నాయి... ముఖ్యంగా టారీఫ్స్ వ్యవహారం కూడీ వీరిమధ్య చర్చకు రావచ్చు.
అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబం రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనుంది. జైపూర్ కు విచ్చేసే వారికి సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పాటు పింక్ సిటీలో వాన్స్ ఫ్యామిలీ పర్యటిస్తుంది. ఈ పర్యటన రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు మంచి అవకాశం.
వాన్స్ కి రాజరిక స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమెర్ కోటలోని సూరజ్‌పోల్ గేట్ వద్ద ఆయనకు సంప్రదాయ స్వాగతం లభిస్తుంది. వెండి హౌదా, ఆభరణాలతో అలంకరించిన రెండు అందమైన ఏనుగులు 'చందా', 'పుష్ప' ఆయనకు స్వాగతం పలుకుతాయి. పూల వర్షం కూడా ఉంటుంది.
జైపూర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి, గవర్నర్ సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలుకుతారు. తర్వాత వాన్స్ రాంబాగ్ ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటారు. ఏప్రిల్ 22న ఆమెర్ కోట, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, హవా మహల్ వంటి చారిత్రక ప్రదేశాలు సందర్శిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమెర్ కోటను సందర్శకులకు తాత్కాలికంగా మూసివేశారు.
వాన్స్ కుటుంబానికి రాజస్థానీ సాంప్రదాయ వంటకాలు దాల్,బాటీ,చూర్మా, గట్టే కి సబ్జీ వడ్డిస్తారు. అమెరికా ఉపాధ్యక్ష కుటుంబానికి ఏ లోటు లేకుండా ఆతిథ్యం అందించాలని ఇప్పటికే రాజస్థాన్ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజస్థాన్ పర్యటన అనంతరం యూపీలోని ఆగ్రాను సందర్శించనున్నారు జె.డి. వాన్స్.