
సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోవారం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేసింది. సివిల్స్ ఫలితాల్లో తొలి నాలుగు స్థానాల్లో అమ్మాయిలే నిలిచారు. శృతి శర్మ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. అంకిత అగర్వాల్.. రెండో ర్యాంక్, గామిని సింగ్మా.. మూడో ర్యాంక్, ఐశ్వర్య వర్మ.. నాలుగో ర్యాంక్ సాధించారు. సివిల్స్ టాపర్ నిలిచిన శృతి శర్మ మాట్లాడుతూ.. యూపీఎస్‌సీ పరీక్షలో అర్హత సాధిస్తానని తనకు నమ్మకం ఉందని.. అయితే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ (IAS)లో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు.
శృతి శర్మ విషయానికి వస్తే ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందినవారు. ఆమె హిస్టరీ స్టూడెంట్. శృతి శర్మ సెయింట్ ఢిల్లీ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని స్టీఫెన్స్ కాలేజ్ నుంచి పట్టభద్రులయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె యూపీఎస్సీ సీఎస్‌ఈ పరీక్షల కోసం చాలా కాలంగా శిక్షణ పొందుతున్నారు. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA)లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు.
ఈసారి యూపీఎస్‌సీ మొత్తం 685 మందిని ఎంపిక చేయగా.. వీరిలో జనరల్ కోటా నుంచి 244 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 73 మంది, ఓబీసీ నుంచి 203 మంది, ఎస్సీ కేటగిరి నుంచి 105 మంది, ఎస్టీ కేటగిరి నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే.. ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు.
ఇక, యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2021 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది అక్టోబర్ 21న నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 29న విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు main examination నిర్వహించారు. ఈ ఫలితాలు మార్చి 17న ప్రకటించారు. అందులో అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చివరిగా నేడు తుది ఫలితాలను విడుదల చేశారు.