యూపీఎస్సీ సివిల్స్- 2022 తుది ఫలితాలు విడుదల.. టాపర్‌గా ఇషితా కిషోర్.. తొలి 4 ర్యాంకులు అమ్మాయిలవే..

Published : May 23, 2023, 02:10 PM ISTUpdated : May 23, 2023, 05:06 PM IST
యూపీఎస్సీ సివిల్స్- 2022 తుది ఫలితాలు విడుదల.. టాపర్‌గా ఇషితా కిషోర్.. తొలి 4 ర్యాంకులు అమ్మాయిలవే..

సారాంశం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సివిల్స్ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులను మహిళ అమ్మాయిలే కైవసం చేసుకన్నారు. సివిల్స్ 2022 టాపర్‌గా ఇషితా కిషోర్ నిలిచారు. గరిమా లోహియా.. రెండో ర్యాంకు, ఉమా హారతి.. మూడో ర్యాంకు, స్మృతి మిశ్రా.. నాలుగో ర్యాంకు సాధించారు. 

సివిల్స్ టాపర్‌గా నిలిచిన ఇషితా కిషోర్.. ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. గరిమా లోహియా, స్మృతి మిశ్రాలు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్లు కాగా.. ఉమా హారతి  ఐఐటీ-హైదరాబాద్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఉమా హారతి తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె. ఇక, ప్రతిష్టాత్మక సివిల్స్ పరీక్షలో మహిళా అభ్యర్థులు మొదటి మూడు ర్యాంకులు సాధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం. 2021 సివిల్ సర్వీసెస్ పరీక్షలో శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామిని సింగ్లా వరుసగా మొదటి, రెండవ, మూడవ స్థానాలను సాధించారు.

ఇషితా కిషోర్ తన ఐచ్ఛిక సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్  అండ్ అంతర్జాతీయ సంబంధాలతో పరీక్షలో అర్హత సాధించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్ (ఆనర్స్)లో పట్టభద్రురాలు అయ్యారు. ఇక, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరిమల్ కాలేజీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన గరిమ లోహియా.. కామర్స్ అండ్ అకౌంటెన్సీని ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా తీసుకుని రెండవ ర్యాంక్‌ను పొందారు.

హైదరాబాద్‌లోని ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేసిన హరతి.. ఆంత్రోపాలజీ ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా మూడవ స్థానంలో నిలిచారు. ఇక, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరాండా హౌస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ (బీఎస్సీ) అయిన స్మృతి మిశ్రా జువాలజీని ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా తీసుకుని నాల్గవ స్థానంలో నిలిచారు.


2022 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 933 మంది అభ్యర్థులు(613 మంది పురుషులు, 320 మంది మహిళలు) అర్హత సాధించారని కమిషన్ తెలిపింది. టాప్ 25 అభ్యర్థుల్లో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారని పేర్కొంది.  ఇక, అర్హత సాధించినవారిలో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99 మంది, ఓబీసీ నుంచి 263 మంది, ఎస్సీ నుంచి 154, ఎస్టీ నుంచి 72 మంది ఉన్నారు. వీరిలో సివిల్స్ లో అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్ కు 180 మంది, ఐపీఎస్ కు 200 మంది, ఐఎఫ్ఎస్ కు 38 మందిని ఎంపిక చేశారు. ఇక, మొత్తం 178 మంది అభ్యర్థులను రిజర్వ్ లిస్ట్‌లో ఉంచినట్లు తెలిపింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని కేంద్రం నివేదించిన ఖాళీలు సంఖ్య 1,022గా ఉంది. ఫలితాల ప్రకటన తేదీ నుంచి 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో మార్కులు అందుబాటులో ఉంటాయని యూపీఎస్సీ తెలిపింది.

ఇక, యూపీఎస్సీ సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది జూన్ 5న నిర్వహించబడింది. ఈ పరీక్షకు మొత్తం 11,35,697 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,73,735 మంది అభ్యర్థులు వాస్తవానికి హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జూన్ 22న విడుదలయ్యాయి. ప్రధాన పరీక్ష సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు నిర్వహించబడింది. ఫలితాలు డిసెంబర్ 6న ప్రకటించబడ్డాయి. ఇంటర్వ్యూలు మే 18న ముగిశాయి.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం