
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ తరంలో కొందరు కోడళ్లు. వయసులో పెద్ద అని కూడా చూడకుండా అత్తల మీద దాష్టీకం చేస్తున్నారు. ఈ కోడలైతే మరో అడుగు ముందుకేసి వేడన్నం వడ్డించలేదని పోలీసులకు అత్తమీద ఫిర్యాదు చేసింది.
ఉత్తరప్రదేశ్ పోలీసులకు విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. నేరం చేస్తే లేదా ఆపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తారు కానీ లక్నోకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అవాక్కయ్యారు. ఒకప్పుడు కోడళ్లపై అత్తలు పెత్తనం చెలాయించే వారు.
ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. కోడల్లే అత్తలపై జులుం చూపిస్తున్నారు. తాజాగా లక్నోకు చెందిన వివాహిత వేడి వేడి ఆహారం వడ్డించలేదని తన అత్తమీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన యూపీలోని గోరఖ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
గఘహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజ్‌గన్వాలో ఓ కుటుంబం నివాసముంటోంది. అత్తా కోడలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి భర్తలు ఉద్యోగాల రీత్యా వేరే ప్రదేశాల్లో ఉంటున్నారు. అయితే కోడలు ఇంటి పనుల్లో ఏ మాత్రం సహాయం చేయకుండా కాలక్షేపం చేస్తోంది.
వంట పనుల నుంచి మొదలుపెట్టి అన్ని పనులు అత్త తనే స్వయంగా చేసుకుంటుంది. ఇదే క్రమంలో ఇటీవల అత్త సమయానికి ఆహారం వడ్డించలేదని, అది కూడా పాచిపోయిన ఆహారం పెడుతుందని కోడలు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే వారింటికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తన అత్త టీవీ సీరియల్స్ లో లీనమై పోతుందని, వేడి వేడి ఆహారం వడ్డించడం లేదని కోడలు పోలీసులకు చెప్పింది. దీంతో రోజు రోజుకు తన ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపింది. ఆమె మాటలు విన్న పోలీసులు షాక్ కు గురయ్యారు. అత్త కూడా కోడలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వంట, ఇంటి పనుల్లో కోడలు సహాయం చేయడం లేదని అత్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది,
ఇద్దరి వాదనలూ విన్న పోలీసులు అత్తాకోడళ్ల ను మందలించారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పోలీసులకు ఫోన్ చేసి సమయం వృధా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కుటుంబ సమస్యలను రచ్చకీడ్చొద్దని బుద్ధి చెప్పారు కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించి వెళ్ళిపోయారు.