ఉత్తర ప్రదేశ్ లో కొత్తగా 11 టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు యోగి సర్కార్ సిద్దమయ్యింది. దీంతో చైనాకు గట్టిదెబ్బ పడనుంది.
లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చే ప్రయత్నాల్లో వున్నారు... ఈ విషయంలో ఎంఎస్‌ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రాన్ని టెక్స్‌టైల్ కేంద్రంగా మార్చేందుకు గోరఖ్‌పూర్, మౌ, భదోహి, అలీగఢ్, బాగ్‌పత్, షామ్లీ వంటి జిల్లాల్లో 11 కొత్త ప్రైవేట్ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు యోగి ప్రణాళిక రచించారు. దీంతో చైనాతో సహా ఇతర దేశాలు లేదా ఇతర రాష్ట్రాల నుంచి యూపీకి ముడిసరుకులు తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు.
రాష్ట్రంలో తొలిసారిగా ఎంఎస్‌ఎంఈ విభాగం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెక్స్‌టైల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా షామ్లీ జిల్లాలో రూ.726 కోట్లతో రాష్ట్రంలోని తొలి ప్రైవేట్ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తారు. దీంతో ఇతర దేశాలు లేదా రాష్ట్రాల నుంచి ముడిసరుకులు తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. నైపుణ్యాభివృద్ధితో పాటు వివిధ సదుపాయాలన్నీ ఒకే చోట లభిస్తాయి.
హస్తకళలు, వస్త్ర పరిశ్రమ ప్రధాన కార్యదర్శి ఆలోక్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 11 ప్రైవేట్ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుతో ముడిసరుకులతో పాటు వివిధ వస్త్రాలు తయారవుతాయని చెప్పారు. దీంతో ఇతర రాష్ట్రాలు లేదా చైనా వంటి దేశాల నుంచి ముడిసరుకులు తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. లక్నోలో ప్రభుత్వం వెయ్యి ఎకరాల్లో పీఎం మిత్ర పార్కును కూడా ఏర్పాటు చేస్తోంది.
ఉత్తరప్రదేశ్ వస్త్ర, గార్మెంట్స్ విధానం- 2022 ప్రకారం హస్తకళలు, వస్త్ర పరిశ్రమల ప్రధాన కార్యదర్శి ఆలోక్ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వ అనుమతి కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రైవేట్ టెక్స్‌టైల్ పార్కుల అభివృద్ధికి, ఐనెక్స్ టెక్స్‌టైల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సైద్ధాంతిక అనుమతి (ఎల్‌ఓసీ) లభించింది. పార్కు పెట్టుబడిదారులు దాదాపు రూ.126.61 కోట్లతో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పార్కు పనిచేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల రూ.600 కోట్ల పెట్టుబడి, 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
షామ్లీలోని కైరానా తాలూకాలోని ఝింఝానా గ్రామంలో 26.75 ఎకరాల్లో ప్రతిపాదిత పార్కు నిర్మితమవుతుంది. ఇందులో నేత, రంగులు వేయడం, ప్రింటింగ్, గార్మెంట్స్ యూనిట్లతో సహా మొత్తం 17 యూనిట్లు ఉంటాయి. పార్కులో పరిపాలన భవనం, బ్యాంకు/ఏటీఎం, శిక్షణ, పరీక్ష కేంద్రం, విశ్రాంతి గృహం, క్యాంటీన్, ప్రథమ చికిత్స కేంద్రం వంటి సాధారణ సదుపాయాలతో పాటు తారు రోడ్డు నెట్‌వర్క్ (వీధి దీపాలతో), నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి వ్యవస్థ, వర్షపునీటి పారుదల వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కర్మాగారం, జీరో లిక్విడ్ డిస్చార్జ్, సమ్మిళిత వ్యర్థాల శుద్ధి కర్మాగారం (సీఈటీపీ) బాయిలర్, నీరు, ఆవిరి పంపిణీ వ్యవస్థ, విద్యుత్ పంపిణీ వ్యవస్థ, వెట్ బ్రిడ్జి వంటి సాధారణ మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయి.