
UP Assembly Election 2022: ఉత్తప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)-సమాజ్ వాదీ (ఎస్పీ) పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు రాష్ట్రంలో అత్యంత కీలకమైన, యాదవుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రధాని మోడీ సైతం వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న క్రమంలో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజలు, సంక్షేమ కార్యక్రమాలు అంటే పట్టించుకోలేదని మోడీ ధ్వజమెత్తారు. గత పాలకులు మాఫియా, క్రిమినల్స్‌కు సపోర్ట్ చేశారని ప్రధాని మోడీ ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే 2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు మరణశిక్ష విధించిన అంశాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్ వాదీ పాలనలో ఉన్న సమయంలో ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకుందని ఆరోపించారు. “ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన పలువురు ఉగ్రవాదులపై ఉన్న కేసులను సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఉగ్రవాదులు రాష్ట్రవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడగా, ఎస్పీ ప్రభుత్వం వారిపై విచారణకు అనుమతించలేదు” అని హర్దోయ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు.
“2007లో లక్నో, అయోధ్యలోని కోర్టు ప్రాంగణాల్లో పేలుళ్లు జరిగాయి. 2012లో SP ప్రభుత్వం తారిఖ్ కజ్మీ అనే ఉగ్రవాదిపై కేసును ఉపసంహరించుకుంది. అయితే SP ప్రభుత్వ కుట్రను కోర్టు భగ్నం చేసింది. ఉగ్రవాదికి జీవిత ఖైదు విధించబడింది ” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “ఎస్పీ, కాంగ్రెస్ నాయకులు ఇద్దరూ ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులను 'జీ' అని సంబోధిస్తారు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల నిర్మూలనపై వారు ఏడ్చారు” అంటూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు మరోసారి పట్టం కడితే సుపరిపాలన అందజేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోపాటు సమాజ్ వాదీ పార్టీపై మోడీ ఫైరయ్యారు. 2014 నుంచి 2017 వరకు ఇక్కడ కుటుంబ పాలన ఉందన్నారు. హర్దొయ్ ప్రజలు ఈ సారి రెండు సార్లు హోళి జరుపుకునేందుకు సిద్దంగా ఉండాలని మోడీ అన్నారు. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ర్యాలీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.