
న్యూఢిల్లీ: సనాతన ధర్మం పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కేవలం డీఎంకేపైనే కాదు.. కాంగ్రెస్ పైనా.. మొత్తం ఇండియా కూటమిపైనే దాడికి దిగింది. బీజేపీ మంత్రి శివలింగం వద్దే చేతులు కడిగిన వీడియో ఇప్పుడు బీజేపీపై కౌంటర్ ఎటాక్ చేయడానికి కాంగ్రెస్‌కు ఓ ఆయుధంలాగే దొరికింది.
యూపీ మంత్రి సతీశ్ శర్మ బారాబంకిలోని శివాలయానికి వెళ్లారు. అక్కడ శివుడికి నమస్కరించిన తర్వాత చేతులను ఆ శివుడికి అతి సమీపంలోనే కడుక్కున్నారు. మరో మంత్రి జితిన్ ప్రసాదా కూడా అక్కడే ఉన్నారు. సతీశ్ శర్మ శివలింగం వద్ద చేతులు కడుగుతుంటే జితిన్ ప్రసాదా చూస్తూ నిలబడ్డట్టుగా ఓ వీడియోలో కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను షేర్ చేస్తూ మతాన్ని బీజేపీ కేవలం ఎన్నికల కోసమే ఉపయోగిస్తుందని ఫైర్ అయ్యాయి. వారికి నిజంగా దేవుళ్లన్నా.. మతమన్నా పెద్దగా గౌరవమే లేదని ఆరోపణలు గుప్పించాయి.
యూపీ కాంగ్రెస్ యూనిట్ ఎక్స్‌లో ఆ వీడియోను షేర్ చేస్తూ.. ‘మతం పేరిట రాజకీయాలు చేసే వీరికి (బీజేపీ నేతలకు) శివలింగం వద్దే చేతులు కడగడం తప్పు అని కూడా తెలియదు. వీరిక మతంపైనా విశ్వాసం లేదు. ప్రజలపైనా విశ్వాసం లేదు’ అని పేర్కొంది.
సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఇదే విషయంపై బీజేపీ పై దాడి చేశారు. ‘బీజేపీ కేవలం మతాన్ని మార్కెటింగ్ చేయడాన్నే నమ్ముతుంది. ఈ పార్టీ నేతలకు మతం అంటే గౌరవం లేదు’ అని పేర్కొన్నారు.
Also Read: UP: ఈ ఎన్నికలో పార్టీ వర్కర్లు నోటాకు ఓటు వేయండి.. లేదంటే ఓటే వేయకండి: బీఎస్పీ విచిత్ర విజ్ఞప్తి
సతీశ్ శర్మ ఈ ఘటన గురించి వివరణ కోరగా.. తాను శివలింగానికి దూరంగానే చేతులు కడుక్కున్నానని, అది కూడా పురోహితుడి సూచనల మేరకే కడుక్కున్నానని చెప్పారు. తాను మతాతీడుగా ఉంటానని కలలోకూడా అనుకోబోనని సోమవారం చెప్పారు. తన చర్యల వల్ల ఎవరైనా బాధపడితే తాను క్షమాపణలు కోరుతున్నట్టు పేర్కొన్నారు.