
Uttar Pradesh: ఉత్తప్రదేశ్ లో శుక్రవారం నాడు మూడవ యూపీ ఇన్వెస్టర్ల సమ్మిట్ (UP Investors Summit 2022) శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో రూ. 8,000 కోట్ల విలువైన 1,406 ప్రాజెక్టులు ఉన్నాయి. వ్యవసాయం, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్, MSME, తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఫార్మా, పర్యాటకం, రక్షణ మరియు ఏరోస్పేస్, చేనేత మరియు జౌళి వంటి విభిన్న రంగాలలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ వేడుకకు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ, "లక్నో బయలుదేరి వెళుతున్నాను.. అక్కడ నేను యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ @ 3.0 గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీలో పాల్గొంటాను. యూపీలో ప్రజల జీవితాలను మార్చే వివిధ పెట్టుబడి ప్రాజెక్టులకు పునాది రాయి వేయబడుతుంది" అని పేర్కొన్నారు. అలాగే, యూపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. “గత ఐదేళ్లలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఈ పెట్టుబడులు విభిన్న రంగాలను కవర్ చేస్తాయి. రాష్ట్రంలోని మంచి వ్యాపార వాతావరణం పెట్టుబడిదారులకు మరియు స్థానిక యువతకు మేలును చేకూరుస్తున్నదని తెలిపారు.
"అనేక సంస్కరణలతో భారతదేశాన్ని ఒక దేశంగా బలోపేతం చేయడానికి మేము కృషి చేసాము. ఈ క్రమంలోనే అనేక పథకాలు సైతం తీసుకువచ్చాం. ఒక దేశం-ఒకే పన్ను GST, ఒక దేశం-ఒక గ్రిడ్, ఒక దేశం-ఒక మొబిలిటీ కార్డ్, ఒక దేశం-ఒక రేషన్ కార్డ్. ఈ ప్రయత్నాలన్నీ మా దృఢమైన మరియు స్పష్టమైన విధానాలకు ప్రతిబింబం" అని ప్రధాని మోడీ అన్నారు. “వేగవంతమైన వృద్ధి కోసం, మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పెట్టుబడి మరియు తయారీపై కలిసి పని చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో అపూర్వమైన 7.50 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయం కేటాయించడం ఈ దిశలో ఒక ముందడుగు” అని ప్రధాని అన్నారు. యూపీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో మోడీ ప్రసంగిస్తూ.. యువత మీ కలలను సాకారం చేస్తారని పేర్కొంటూ.. రాష్ట్ర యువత పై ప్రశంసలు కురిపించారు.