యూపీలో మరో గ్యాంగ్ స్టర్ హతం: ఈసారి ఆక్సిడెంట్ లోనే...

By team teluguFirst Published 28, Sep 2020, 9:57 AM
Highlights

గ్యాంగ్ స్టర్ ఫిరోజ్ ను ముంబైలో అరెస్టు చేసి పోలీసులు లక్నోకు తీసుకువస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సదరు గ్యాంగ్ స్టర్ మృత్యువాత పడ్డాడు. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్ స్టర్ల ఈ మధ్య వరుసగా హతమవుతున్నారు. తాజాగా ఈ రాష్ట్రానికి చెందిన మరో గ్యాంగ్‌స్టర్‌ మృతిచెందాడు. స్థానిక పోలీసుల కళ్లుగప్పి ముంబై పారిపోయిన ఆ గ్యాంగ్ స్టర్ తలదాచుకుంటున్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. 

గ్యాంగ్ స్టర్ ఫిరోజ్ ను ముంబైలో అరెస్టు చేసి పోలీసులు లక్నోకు తీసుకువస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సదరు గ్యాంగ్ స్టర్ మృత్యువాత పడ్డాడు. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

వివరాలోకి వెళితే ....  కరుడుగట్టిన నేరస్థుడు ఫిరోజ్‌ అలీ అలియాస్‌ షమీ జాడ కోసం యూపీ పోలీసులు గత కొన్ని రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముంబైలోని నాలా సొపారా అనే మురికివాడలో అతడు ఉన్నట్లు సమాచారం అందింది. 

దీంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్టుమెంటు కి చెందిన ఠాకూర్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్‌ఐ జగదీశ్‌ ప్రసాద్‌ పాండే, కానిస్టేబుల్‌ సంజీవ్‌ సింగ్‌లను ముంబై పంపించారు ఉన్నతాధికారులు.  

ఫిరోజ్‌ను పట్టుకునేందుకు ప్రైవేటు వాహనంలో బయల్దేరిన ఈ ఇద్దరు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వెంటనే అదే వాహనంలో లక్నోకు తిరుగుపయనమయ్యారు. జాతీయ రహదారి మీద ప్రయాణిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా సమీపానికి చేరుకోగానే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ ఫిరోజ్‌ అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జగదీశ్‌, సంజీవ్‌ సింగ్‌తో పాటు డ్రైవర్‌ సులభ్‌ మిశ్రా, ఫిరోజ్‌ బావ అఫ్జల్‌ గాయాలపాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన జంతువును తప్పించే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్పగా..... ప్రత్యక్ష సాక్షులు మాత్రం డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని అంటున్నారు. 

ఏదేమైనా యూపీలో ఈ మధ్య కాలంలో గ్యాంగ్ స్టర్ల ఏరివేత జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను మధ్యప్రదేశ్ నుండి యూపీ తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకొని అతడు ఎన్కౌంటర్ లో మరణించడం సంచలనం సృష్టించింది. 

దీనిపై సుప్రీమ్ కోర్టులో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ స్టర్ మరణంపై కూడా అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 28, Sep 2020, 9:57 AM