
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్‌కౌంటర్ గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉన్నది. ఆ ఎన్‌కౌంటర్ యూపీ సహా ఇతర రాష్ట్రాల్లోనూ చర్చను లేవదీసింది. తాజాగా, ఈ ఘటనకు సంబంధించి ఆసక్తికర విషయం తెలిసింది. ఎన్‌కౌంటర్‌లో అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్‌తోపాటు అతని సహచరుడు గులాం మరణించిన విషయం విదితమే. గులాం మరణంపై ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయడాన్ని ఆమె సమర్థించింది. అంతేకాదు, కొడుకు మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా నిరాకరించింది.
గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కోసం తన కొడుకు పని చేసేవాడని తనకు తెలియదని గులాం తల్లి మీడియాకు వివరించింది. ప్రభుత్వ చర్య సరైనదే అని ఆమె పేర్కొంది. ఇలాంటి చర్యలతోనే గ్యాంగ్‌స్టర్లు, నేరస్తులకు బుద్ధి వస్తుందని తెలిపింది.
కొడుకు మరణించాడన్న బాధ ఉన్నప్పటికీ తన కొడుకు గ్యాంగ్‌స్టర్ కోసం పని చేసేవాడన్న విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక వైపు బాధ పడుతూనే మరో వైపు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చర్యను సమర్థించింది. అంతేకాదు, తన కొడుకు గులాం మృతదేహాన్ని కూడా తీసుకోలేదు. గులాం మృతదేహాన్ని తాను తీసుకోదని తెలిపింది. అయితే, గులాం భార్య తీసుకుం టుందేమో అని వివరించింది.
Also Read: మహారాష్ట్రలో పండ్లు అమ్ముతూ.. ఆటో నడుపుతూ.. పోలీసుల రహస్య ఆపరేషన్.. ఎందుకో తెలుసా?
ఉమేష్ పాల్ అపహరణ, హత్య కేసులో అతీక్ అహ్మద్, ఆయన కొడుకు అసద్ అహ్మద్‌లు నిందితులుగా ఉన్నారు. కొన్ని నెలలుగా అసద్ అజ్ఞాతంలో ఉన్నారు. అతని కోసం యూపీ పోలీసులు ముమ్మరంగా గాలింపులు చేశారు. చివరకు అసద్ ఉజ్జయినిలో ఉన్నారని తెలుసుకుని పోలీసు టీమ్ అక్కడికి వెళ్లింది. అక్కడే పోలీసులకు, అసద్, ఆయన వెంటే ఉన్న గులాంలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో అసద్ అహ్మద్, సహచరుడు గులాంలు మరణించారు.
అసద్ తండ్రి అతీక్ అహ్మద్ గుజరాత్‌లోని సబర్మరీ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.