
జమ్ము: ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా చాలా చోట్ల నుంచి భక్తులు జమ్ము కశ్మీర్‌లోని అమర్నాథ్ దేవస్థానాన్ని దర్శించుకుంటారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. తాజాగా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర గురించి శ్రీ అమర్నాథ్‌జీ శ్రైన్ బోర్డ్ (ఎస్ఏఎస్‌బీ) కీలక ప్రకటన చేసింది. జులై 1వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని వివరించింది. ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ యాత్ర చేపట్టే భక్తులు ఏప్రిల్ 17 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సారథ్యంలో రాజ్‌భవన్‌లో ఎస్ఏఎస్‌బీ సమావేశం జరిగింది. ఇందులో అమర్నాథ్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్ ప్రకటిస్తూ యాత్రను సులభతరంగా, ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు.
ఇబ్బందులు లేకుండా అమర్నాథ్ యాత్ర నిర్వహించాలనేదే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల లక్ష్యం అని ఆయన వివరించారు. భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు, ఇతర అత్యావశ్యక సేవలు, సదుపాయాలు అందిస్తామని తెలిపారు. యాత్ర ప్రారంభానికి ముందే టెలికాం సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. లాడ్జింగ్, విద్యుత్, నీటి సదుపాయం, భద్రత, ఇతర అన్ని రకాల ఏర్పాట్ల కోసం సిబ్బంది, ఆయా శాఖలు తలమునకలయ్యాయని వివరించారు. అనంత్‌నాగ్‌లోని పహల్గాం ట్రాక్ నుంచి, గందర్బాల్ జిల్లాలోని బల్తాల్ నుంచి ఏకకాలంలో యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
భక్తుల కోసం అమర్నాథ్ దేవస్థానంలో ఉదయం, సాయంత్రం పూట పూజలను లైవ్ టెలికాస్ట్‌ను ఎస్ఏఎస్‌బీ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్ర గురించి రియల్ టైం సమాచారం, దారిలో వాతావరణం, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే ఇతర సేవలను వినియోగించుకోవడానికి ఓ యాప్‌ను రూపొందించారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చారు.