
UP Elections News 2022 : యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కాన్వాయ్ కు ఎదురెళ్లి నల్లజెండా ఊపి నిరసన తెలిపిన ఓ సాధారణ మహిళ నేడు ఎన్నికల బరిలో నిలబడింది. ఇప్పుడు ఆమె ప్రధాన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ నుంచి లక్నో నార్త్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి చిన్న వయస్సు కలిగిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె రికార్డు నెలకొల్పారు.
2017 సంవత్సరం జూన్ నెలలో శుక్లా మరో పది మందితో కలిసి లక్నో యూనివర్శిటీ రోడ్‌లో ఆదిత్యనాథ్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆమె నల్లజెండాలు ఊపింది. దీంతో ఆమెను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల చూపు ఆమెపై పడింది.
‘‘హిందీ స్వరాజ్ దివస్ కార్యక్రమంలో పాల్గొనడానికి లక్నో యూనివర్సిటీ క్యాంపస్‌కు సీఎం యోగీ ఆధిత్యనాథ్ వెళ్తున్నారు. అదే సమయంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సమాజ్ వాదీ ఛత్ర వంటి విద్యార్థి సంఘాలు ఈ కాన్వాయ్ కు అడ్డుకునేందుకు రోడ్డుపై కూర్చున్నారు. దీంతో కాన్వాయ్ ఆగింది. వారికి నల్లజెండాలు చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందులో నేను ఉన్నాను. ’’ అని శుక్లా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘ మరుసటి రోజు మమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. నిరసన తెలిపేందుకు ప్రజాస్వామిక మార్గాలను ఉపయోగించినప్పటికీ ఇది జరిగింది. మమ్మల్ని అరెస్టు చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ సరైన దాని కోసం పోరాడాలనే నా విశ్వాసాన్ని మాత్రం పునరుద్ఘాటించింది ’’ అని ఆమె ఆ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
నల్ల జెండాలు ఊపి నిరసన తెలిపినందుకు శుక్లా 20 రోజుల జైలు శిక్ష అనుభవించారు. విడుదలైన అనంతరం ఆమె సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆ పార్టీ విద్యార్థి విభాగం అయిన సమాజ్‌వాదీ చత్ర సభకు నాయకత్వం వహించారు. సమాజ్ వాదీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు.. “ములాయం సింగ్ యాదవ్ రాజకీయ పోరాటం, అఖిలేష్ యాదవ్ విధానాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇంకా విద్యార్థి రాజకీయాల్లో చురుకైన ఒక యుక్త వయస్కురాలిగా ఎస్పీ ప్రజాస్వామ్య విలువలకు దగ్గరగా ఉందని నేను భావిస్తున్నాను’’ అని శుక్లా సమాధానం ఇచ్చారు.
రాజకీయ నాయకురాలిగా యువకులు, విద్యార్థుల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు శుక్లా తెలిపారు. యువతను, స్టూడెంట్లను చదువు పేరుతో రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారని తను నమ్ముతున్నానని చెప్పారు. దీనిని ముందుగా మార్చాలని అన్నారు. రాజకీయంగా అవగాహన ఉన్న స్టూడెంట్ మాత్రమే మంచి నాయకుడిని ఎన్నుకోగలరని తెలిపారు. యువత దేశ రాజకీయాలను మార్చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్లగలుగుతారని చెప్పారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని శుక్లా తెలిపారు. బీజేపీ అభ్యర్థిపై పోరాడటానికి తన వద్ద వనరులు లేవని, అయితే పార్టీ, స్థానిక ప్రజలు, యువత మద్దతుతో తాను తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు 2018లో లక్నో యూనివర్శిటీ పూజ శుక్లా ప్రవేశాన్ని నిరాకరించారు. దీంతో ఆమె నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించింది, దీంతో యూనివర్సిటీ తలొగ్గింది. ఆమెతో పాటు నిరసన తెలిపిన స్టూడెంట్లందరికీ ప్రవేశాన్ని అనుమతి ఇచ్చింది. జనవరి 2020లో లక్నోలోని క్లాక్ టవర్ వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే మహిళల బృందంతో శుక్లా పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా ఎస్పీ ఆమెకు టికెట్ కేటాయించకముందే ఆమె లక్నో నార్త్ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పూజ శుక్లా బీజేపీ అభ్యర్థి నీరజ్ బోరాతో పోటీ పడుతున్నారు. ఈమె పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నాలుగో దశలో ఫిబ్రవరి 23న పోలింగ్ జరగనుంది.