
ఇస్లామాబాద్: పాకిస్తాన్(Pakistan)లో హిందువులు సహా మైనార్టీలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా, ఓ హిందూ వ్యాపార వేత్త(Hindu Businessman)ను కొందరు దుండగులు తుపాకీతో కాల్చి(Shot Dead) చంపారు. గోట్కీ జిల్లాలోని దహర్కి టౌన్‌లో ఈ సోమవారం ఈ ఘటన జరిగింది. దీంతో నిరసనకారులు కొందరు వీధుల్లోకి వచ్చిన ఆందోళనలు చేశారు. అక్కడి రహదారులపై బైఠాయించారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వెంటనే దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్లను దిగ్బంధించారు. ఈ ఘటన సింధ్ ప్రావిన్స్‌లో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలను పెంచి పోషించే కుట్రలో భాగంగా జరిగిందని స్థానిక నేత ఒకరు తెలిపారు.
హిందూ వ్యాపారవేత్త సతన్ లాల్‌ను దహర్కి టౌన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో తుపాకీతో కాల్చి సోమవారం హత్య చేశారు. రెండు ఎకరాల భూమి వివాదంలో ఆయనను దహర్ కమ్యూనిటీకి చెందిన కొందరు దుండగులు హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సతన్ లాల్‌కు చెందిన రెండు ఎకరాల భూమిలో ఓ కాటన్ ఫ్యాక్టరీ, ఫ్లోర్ మిల్‌ను ప్రారంభించే కార్యక్రమం ఒకటి జరిగిందని, అక్కడే సతన్ లాల్‌ను తుపాకీతో కాల్చి చంపారని సతన్ లాల్ ఫ్రెండ్ ముక్కి అనిల్ కుమార్ తెలిపారు. ఆ ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించిన ఓ గురువుకు వందనంగా గాల్లోకి కాల్పులు జరిపారని తాను తొలుత భావించారని అన్నారు. సతన్ లాల్ హత్య తర్వాత అంతకు క్రితం ఆయన బెదిరింపుల గురించి మాట్లాడిన ఓ వీడియో వైరల్ అయింది.
‘వారు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కళ్లు పెరికేస్తారట. చేతులు, కాళ్లు నరికేస్తారట. పాకిస్తాన్ విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నేను ఎందుకు విడిచి వెళ్లాలి. నేను ఈ దేశ పౌరుడిని. నేను ఇక్కడి వాడినే. ఇక్కడే చనిపోవడానికి ఇష్టపడతా. కానీ, వారికి తలవంచను’ కొన్ని నెలల క్రితం విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. ‘ఆ రోడ్డు పక్కన ఉన్న భూమి నాదే.. నేను ఎందుకు వదులుకోవాలి’ అని ప్రశ్నించారు. తనను బెదిరిస్తున్న వారి పేర్లను ప్రస్తావిస్తూ.. తనకు న్యాయం చేయాలని పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర ఉన్నత అధికారులను కోరారు.
ఈ నేపథ్యంలోనే ఆయనను హతమార్చడంలో చాలా మంది ఆగ్రహానికి లోనయ్యారు. అక్కడి హైవేపై బైఠాయించారు. ప్రజలు ఒత్తిడి తేవడంతో పోలీసులు నిందితులు బచల్ దహర్, మరో నిందితుడిని అరెస్టు చేశారు. వ్యాపారవేత్త సతన్ లాల్‌ను చంపేసిన నిందితులను అరెస్టు చేశామని, రహదారులను క్లియర్ చేశామని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలిపారు.
ఈ ఘటనపై పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నేత ఖెహల్ దాస్ కొహిస్తానీ మాట్లాడుతూ, సింధ్‌లో ముస్లింలు, హిందువులు కలిసి శాంతియుతంగా జీవిస్తున్నారని, ఆ ప్రశాంత వాతావరణాన్ని, సింధ్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కొందరు హిందు యువతులను బలవంతంగా మతమార్పిడులు చేయిస్తున్నారని, కొందరిని కిడ్నాప్ చేస్తున్నారని, ఇంకొందరిని హత్య చేసే ఘటనలూ వెలుగు చూస్తున్నాయని తెలిపారు. ఈ ప్రావిన్స్‌లో జీవిస్తున్న మైనార్టీలకు భద్రత ఇవ్వకుంటే పరిస్థితులు చేయిదాటిపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు.