
UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. పొలిటికల్ డ్రామా మరింత రక్తి కడుతోంది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నారు.
ఆయన మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏళ్ల తరబడి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. అలాగే.. మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గానికి ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీటు కర్హాల్ నుంచి తాను బరిలోకి దిగాలని అఖిలేష్ నిర్ణయించుకున్నారు.
కర్హాల్ నియోజకవర్గంలో దాదాపు 1.44 లక్షల మంది యాదవ వర్గం ఓట్లు ఉండటంతో .. ఈ నియోజక వర్గం నుంచి అఖిలేష్‌ను బరిలో దించడం సేప్ అని.. పార్టీ అధిష్టానం భావించింది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ మొదటి సారి పోటీ చేయడం విశేషం. 2012లో ఆయన సీఎం.. అయినా.. ఆయన శాసన మండలి నుంచే ఎన్నిక అయ్యారు. కర్హాల్ లో ఫిబ్రవరి 20న ఓటింగ్ జరగనుంది. అఖిలేష్ ప్రస్తుతం అజాంగఢ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కూడా ముందంజలో ఉన్నారు. రైతులకు భరోసాగా నిలుస్తామని, వ్యవసాయ భూముల సేద్యానికి ఉచిత కరెంట్ ఇస్తామని, 22 లక్షల మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని అఖిలేష్ హామీలు గుప్పిస్తున్నారు
ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3 మరియు 7 తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.