ఎన్నికల ర్యాలీలపై నిషేధం మరో వారం పొడిగింపు..! నేడు సమావేశమైన ఈసీ

By Mahesh KFirst Published Jan 22, 2022, 5:18 PM IST
Highlights

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ర్యాలీలు, రోడ్ షోలను ఎన్నికల సంఘం నిషేధించిన సంగతి తెలిసిందే. తొలుత 15వ తేదీ వరకు విధించిన ఈ నిషేధాన్ని ఆ తర్వాత ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా, ఈ నిషేధంపై ఎన్నికల సంఘం సమావేశాన్ని నిర్వహిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలను మరో వారంపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కొన్నివర్గాలు వివరించాయి.
 

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యక్ష ర్యాలీలు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ నిర్ణయాన్ని సమీక్షించడానికి ఎన్నికల సంఘం అంతర్గత సమావేశాన్ని నిర్వహించింది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోల నిషేధంపై నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ, వైద్యారోగ్య నిపుణులు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌లతో వర్చువల్‌గా సమావేశమైంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వర్గాలు ఎన్నికల ర్యాలీలపై నిషేధాన్ని పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించాయి.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని తొలుత ఈ నెల 15వ తేదీ వరకు ప్రకటించింది. అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి కార్యకర్తల సంఖ్యను ఐదు వరకే పరిమితం చేసింది. 15వ తేదీన నిషేధ నిర్ణయాన్ని సమీక్షిస్తామని తెలిపింది. అదే విధంగా ఈ నెల 15వ తేదీన నిషేధంపై ఈసీ సమీక్షించింది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని మరో వారం పాటు పొడిగించింది. అంటే ఈ నెల 22వ తేదీ వరకు ఈ నిషేధాన్ని ప్రకటించింది. అదే సమయంలో బహిరంగ సభ కాకుండా.. ఇండోర్ మీటింగ్ నిర్వహించవచ్చని తెలిపింది. ఇండోర్ మీటింగ్‌లో 300 మందికి లేదా హాల్ సామర్థ్యంలో సగం మేరకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సమీక్షిస్తామని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే 22వ తేదీన ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత ఈసీ అధికారికంగా ప్రకటన వెలువరించాల్సి ఉన్నది. ఇదే తరుణంలో కొన్ని విశ్వసనీయ వర్గాలు ఈ నిషేధాన్ని మరో వారం పాటు పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.

కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వచ్చాయి. కానీ, ఎన్నికల నిర్వహణను ఆపబోమని, అయితే, ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలను నిషేధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా చేపట్టాలని సూచనలు చేసింది. 

Goa, Manipur Uttarakhand Punjab, Uttar Pradesh రాష్ట్రాల్లో   ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వ తేదీ వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయ పార్టీలకు ఈసీ కొన్ని మినహాయింపులను అందించింది.

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇవాళ వరుస సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కూడా చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నందున బహిరంగ సభలు, రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగించాలని ఈసీ నిర్ణయం తీసుకొంది.

click me!